గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఉదయం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. అనంతరం పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడేళ్లలో తెలంగాణ స్థిరంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్టాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని సాధించామన్నారు.
ప్రగతిఫలాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం తెలిపారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. విద్యుత్, సాగు, తాగునీటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శమని చెప్పారు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాము చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు.ఒకప్పుడు తెలంగాణ కరువుకాటకాలకు నిలయంగా ఉండేది. ప్రస్తుతం అదే తెలంగా ణ 2020-21 వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 3.4 లక్షల టన్నుల దిగుబడిని సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీడీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయ రంగం సమకూరుస్తున్నది. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.