ts cm

 

జగన్‌తో పోరు ఉధృతం

 

🔹ఏపీ జల దోపిడీపై 6గంటలు సమీక్ష
🔹కృష్ణాపై కేసీఆర్ కీలక నిర్దేశం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. పంచాయితీ తీర్చాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆక్షేపించిన తెలంగాణ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేత కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను సైతం ఆశ్రయించింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు వద్ద తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంపై ఏపీ ఫిర్యాదు మేరకు ఈనెల 9న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ఉండగా, దాన్ని వాయిదా వేయాలని, తెలంగాణ అభ్యంతరాలనూ పరిశీలించాలని టీఆర్ఎస్ సర్కారు డిమాండ్ చేస్తున్నది. ఈ క్రమంలోనే కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా, సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో, తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి సమావేశం లోతుగా చర్చించింది.

స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానించింది. నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రంపై వత్తిడిచేస్తూ వస్తున్నక్రమంలో, కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం తెలిసిందే. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో చర్చించిన సీఎం అధికారులకు ఆ దిశగా మార్గనిర్దేశం చేశారు.