supreme court

 

రైతు సంఘాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

 

🔹ఢిల్లీ గొంతు పిసికారు, ఇప్పుడు జంతర్ మంతర్ వద్దకా అని ప్రశ్న.?

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది నుంచీ పోరాడుతున్న రైతు సంఘాలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారుల్ని ఏడాదిగా దిగ్బంధం చేస్తున్న రైతు సంఘాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ప్రజల ఇభ్బందుల్ని కూడా పట్టించుకోకుండా ఢిల్లీ బయట రోడ్లను దిగ్బంధించారు. ఇప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి అడుగుతున్నారంటూ వ్యాఖ్యానించింది. ఢిల్లీ నగరం గొంతు పిసికారంటూ ఈ సందర్భంగా రైతు సంఘాలపై జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రోడ్లపై నిరసనలు చేయడానికి బదులుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తేనే మంచిదని రైతు సంఘాలకు అత్యున్నత న్యాయస్ధానం సూచించింది. దీనిపై అత్యవసర విచారణ కోరే హక్కు కూడా రైతు సంఘాలకు ఉందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దాన్ని వదిలిపెట్టి రోడ్లపై నిరసనలు నిర్వహించడం ద్వారా ప్రజా జీవనానికి భంగం కలిగిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. నిత్యం రహదారుల్ని దిగ్బంధించడం సరికాదని రైతు సంఘాలకు సుప్రీంకోర్టు హితవు పలికింది. ఓసారి వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశాక తిరిగి నిరసనలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. కోర్టులపై నమ్మకం ఉంటే నిరసనలు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు సంఘాలు ఢిల్లీ చుట్టూ ఉన్న సింఘూతో పాటు ఇతర సరిహద్దులనూ దిగ్బంధించి కొంతకాలంగా నిరసనలు చేపడుతున్నారు. అయితే పోలీసులు వీరిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పడు తాజాగా జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు కోరడంపై సుప్రీంకోర్టు ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రైతుసంఘాల నిరసనల వల్ల ప్రజా జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇవాళ మరోసారి సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రైతు సంఘాలు ఇబ్బందుల్లో పడ్డాయి.