Jagan & SC

 

జగన్ సర్కార్ కు సుప్రీం భారీ షాక్

 

🔹అమరావతి భూములపై కీలక తీర్పు
🔹జగన్ సర్కార్ వాదనతో ఏకీభవించని సుప్రీంకోర్టు
🔹హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు సమర్ధన
🔹టీడీపీ, అమరావతి రైతులకూ భారీ ఊరట

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం సందర్భంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటు భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై పలు దర్యాప్తులు కూడా చేయించింది. అయితే దీనిపై దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ ఆరోపణల్ని తోసిపుచ్చగా.. ఇవాళ సుప్రీంకోర్టు కూడా వాటిని తోసిపుచ్చింది. దీంతో అమరావతి రైతులతో పాటు టీడీపీకి కూడా భారీ ఊరట లభించినట్లయింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజధాని నిర్మాణం నేపథ్యంలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ సర్కార్ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు సుప్రీంకోర్టులోనూ తేలిపోయాయి. గతంలో ఏపీ హైకోర్టు ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని తీర్పు ఇవ్వగా.. ఇవాళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ కు భారీ ఎదురుదెబ్బ తప్పలేదు.

అమరావతిలో భూముల క్రయ విక్రయాల సందర్భంగా అమ్మకం దారులకు కొనుగోలు దారులు వారి నుంచి భూములు ఎందుకు కొంటున్నారో చెప్పకపోవడం మోసమని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో వాదించింది. అయితే ఈ ఆరోపణలతో జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. భూముల బదలాయింపు చట్టం ప్రకారం కొనుగోలుదారులు… భూములను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అమ్మకందారులకు చెప్పాలన్న వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ వ్యవహారంలో భూముల్ని అమ్ముకున్న రైతులు మోసపోయారన్న వాదననూ సుప్రీంకోర్టు ఆంగీకరించలేదు.దీంతో ప్రభుత్వ వాదన తేలిపోయింది. గతంలో అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భఁగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీంతో టీడీపీ పెద్దలు, అప్పటి మంత్రులు భారీగా లబ్ది పొందారని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అయితే గతంలో హైకోర్టు ఈ వాదనను తప్పబట్టింది. అసలు అమరావతి భూములకు ఇన్ సైడర్ ట్రేడింగ్ పదం వాడటాన్ని తప్పుబట్టింది. దీంతో పాటు అమరావతి భూములపై సిట్ దర్యాప్తుపైనా స్టే ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారుకు అక్కడా చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును తప్పుబట్టడానికి ఏమీ లేదని గతంలోనే చెప్పిన సుప్రీంకోర్టు.. తాజాగా ఇవాళ ఆ తీర్పునే సమర్ధిస్తున్నట్లు ప్రకటించింది.

రాజధాని అమరావతి నిర్మాణం సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, భూముల్ని టీడీపీ పెద్దలు కాజేశారని ఇన్నాళ్లూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ పడినట్లయింది. అమరావతి భూములపై వివిధ దర్యాప్తు సంస్ధలతో వైసీపీ సర్కార్ చేయిస్తున్న విచారణకూ సుప్రీంకోర్టు తీర్పు చెక్ పెట్టింది. అమరావతిలో భూముల అక్రమాల ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు టీడీపీ పెద్దలకూ ఈ తీర్పు భారీ ఊరటగా మారబోతోంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవేతో పాటు మరో సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రతివాదుల తరఫున మరో ముగ్గురు న్యాయవాదులు వాదించారు. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం కింద అమరావతి భూముల క్రయ విక్రయాలపై విచారణ జరుగుతోందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలపగా.. ప్రతివాదుల తరఫు న్యాయవాదుల్ని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టం ముందుగానే తెలిసిపోయిన అమరావతి రాజధానికి వర్తించదని వాదించారు. చివరికి వారి వాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది.