kcr and rahul

సడన్‌గా రాహుల్ గాంధీపై ప్రేమ ఎందుకు?

— గులాబీ బాస్ ఏం మెసేజ్ ఇస్తున్నారు?

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ‘ఇండియాలో అతిపెద్ద బఫూన్ ఎవరైనా ఉన్నాడంటే అది రాహుల్ గాంధీనే. రాజకీయాల పట్ల ఆయనది అవగాహనరాహిత్యం. లోక్‌సభలో ప్రధాని మోదీ దగ్గరికి వెళ్లి కౌగిలించుకోవడం, ఆ తర్వాత కన్నుకొట్టడం దేశమంతా చూసింది. నిజానికి రాహుల్ గాంధీ లాంటి బఫూన్లు ఎన్నిసార్లు తెలంగాణలో పర్యటిస్తే టీఆర్ఎస్ పార్టీకి అంతగా మేలు జరుగుతుంది..’ఇవీ.. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ ఎంపీ, నెహ్రూ-గాంధీ వారసుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న మాటలు. వ్యక్తిగత దూషణల విషయానికొస్తే అప్పటికి రాహుల్ ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ అదే. రాహుల్ గాంధీనేకాదు, ఆయన పూర్వీకులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల నేతృత్వంలో దేశం అనుకున్నంత ముందుకుపోలేదని, కాంగ్రెస్ నేతల కురచబుద్ది, ముందుచూపులేమి వల్లే ఇండియా దుస్థితిలోకి దిగజారిందనీ కేసీఆర్ చాలా సార్లు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతుగా నిలిచారు. రాహుల్ గాంధీ పుట్టుకను కించపరుస్తూ అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. బీజేపీ.. ఇదేనా నీ సంస్కారం? రాహుల్ గాంధీని అంత మాట అనొచ్చా? అని తిట్టిపోశారు. అంతేనా, రాహుల్ పూర్వీకులు దేశం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారని, రాహుల్ ముత్తాత(నెహ్రూ) స్వాతంత్ర్యం కోసం జైలు శిక్ష అనుభవించారని, నానమ్మ(ఇందిర), తండ్రి(రాజీవ్ గాంధీ) కూడా దేశం కోసం జరిగే పనిలో ప్రాణాలు కోల్పోయారని కేసీఆర్ గుర్తుచేశారు. ఏ నోటితోనైతే రాహుల్ ను బఫూన్ అన్నారో, అదే నోటితో అతనికి ప్రేమపూర్వక తోడ్పాటును ప్రకటించారు గులాబీ బాస్. బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలు అతి తీవ్రమైనవే అయినప్పటికీ కాంగ్రెస్ నేతల కంటే ఘాటుగా కేసీఆర్ స్పందించడం గమనార్హం.

విషయం ఎంత నీచమైనది లేదా తీవ్రమైనది అయినప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టీఆర్ఎస్ అధినేత సమర్థిస్తే లేదా సంఘీభావం ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ ఏరకమైన ప్రతివిమర్శకు దిగుతుందో కేసీఆర్ కు కచ్చితమైన అంచనా ఉందనడంలో ఎవరికీ సందేహాలు అక్కర్లేదు. అయినా కూడా ఆయన రాహుల్ గాంధీని పబ్లిక్ మీటింగ్ లోనే సమర్థించడానికి వెనుకాడలేదు. ఊహించినట్టుగానే, రాహుల్ గాంధీకి కేసీఆర్ సమర్థన తర్వాత బీజేపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ మిలాఖత్ అయిందని కమలదళం ఆరోపిస్తోంది. రాబోయే(2023) ఎన్నికల్లో బీజేపీని ఒటరిగా ఎదుర్కొనే సత్తాలేక కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని విమర్శిస్తోంది. మొన్నటిదాకా కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి తహతహలాడుతోన్నట్లు తేటతెల్లమైందనీ కాషాయనేతలు అంటున్నారు. మరి, రాహుల్ గాంధీని సమర్థిస్తే వచ్చే విమర్శలు ఎలా ఉంటాయో తెలిసే కేసీఆర్ ఎందుకు ప్రేమ ప్రదర్శించారు? అనేది ప్రస్తుతం తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా కేసీఆర్.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యర్థి బీజేపీనే అనే అభిప్రాయం అందరిలో నాటుకుపోయేలా.. అదే సమయంలో నిజమైన ప్రత్యర్థిగా అవతరించడానికి అవకాశం ఉందని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీని మరింత పలుచన చేసేలా వ్యూమాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని సోయిలో లేకుండా చేయడానికే కేసీఆర్ బీజేపీతో లేని గొడవలు సృష్టించుకుంటున్నాడని, వాస్తవానికి బీజేపీ-టీఆర్ఎస్ ఒకే ఐడియాలజీతో పనిచేస్తున్నాయని, రాజ్యాంగాన్ని తొలగించడ మొదలు హిందూత్వ అజెండాను అమలు చేయడంతో కమల దళం-గులాబీ సైన్యం ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయిని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత శనివారం రాయగిరిలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ అని కాంగ్రెస్‌ ఎంపీ ఉన్నడు. నాకు ఆయనతోని సంబంధం లేదు. కానీ.. వాళ్ల తాత స్వతంత్ర పోరాటంచేసి, అనేక సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. వాళ్ల నాయనమ్మ, నాయన దేశం కోసం పనిచేసుకుంట చనిపోయిన్రు. ఇప్పుడు రాహుల్‌గాంధీ కూడా ఎంపీగా ఉన్నడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుతం. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు అనేక ప్రశ్నలు అడుగుతరు. అట్లనే రాహుల్‌గాంధీ కూడా ఒక ఎంపీగా ఏదో అడిగిండు. దానికి అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ‘రాహుల్‌ గాంధీ.. ఏ అయ్యకు పుట్టినవని మేము నిన్ను అడిగినమా’ అని అన్నడు. ఒక ముఖ్యమంత్రి ఈ మాట అనొచ్చునా? ప్రధాని మోదీ.. ఇది మీ బీజేపీ సంస్కారమా? ఇది మన హిందూ ధర్మమా? ఇది మన దేశానికి మర్యాదనా? ఒక పెద్ద పార్టీ నేతను పట్టుకొని మీ ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు అంటరా? ఆ మాటలు తలచుకొంటేనే నా బుర్ర బద్ధలైతున్నది. కండ్లల్ల నీళ్లు వస్తున్నయి. ఒక ఎంపీని సీఎం ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా? మనం వేదాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం నుంచి ఇదే నేర్చుకొన్నమా? హిందూధర్మం పేరుతో ఓట్లు అడిగే మోసగాళ్లు బీజేపీ వాళ్లు..’అంటూ కేసీఆర్ ఫైరయ్యారు. అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నడ్డాను కేసీఆర్ డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చలు, కామెంట్లు వెల్లువెత్తాయి. అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్ ను ఏమార్చడానికే కేసీఆర్ ఈ రకమైన కామెంట్లు చేశారని, గతంలో ఇదే కేసీఆర్ రాహుల్ గాంధీ, నెహ్రూ ఫ్యామిలీ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారని కొందరు గుర్తు చేస్తే.. అస్సాం బీజేపీ సీఎం వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని, వాటిపై స్పందించడానికి మానవత్వం సరిపోతుందని, కేసీఆర్ ప్రదర్శించింది ఆ మానవత్వాన్నే అని మరికొందరు కామెంట్లు పెట్టారు. మొత్తంగా కాంగ్రెస్ పట్ల సానుకూలత, బీజేపీ పట్ల వ్యతిరేకత చాటుకోవడం ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజన్ లో పడేశారనీ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.