జీహెచ్ఎంసీ ముందు బీజేపి ధర్నా
🔹ముంపు ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయి.. గుర్తించాలి
🔹నాలలు పునరుద్దరించాలి, అక్రమకట్టడాలు కూల్చాలన్న నగర బీజేపి నాయకులు
🔹మునిగిన తర్వాత పులిహార పొట్లాలు ఇస్తే లాభం ఉండదు
🔹నినాదాలతో మారుమోగిపోయిన నగర పాలక సంస్థ
🔹యంత్రాంగం నిద్రలేవాలన్న బీజేపీ
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) వర్షాకాలం వచ్చేసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. వర్షాలు పడి రహదారులు జలమయమైపోవడం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం సగర శివార్లలో ప్రతి ఏడాది నిత్యకృత్యంగా జరిగిపోయే తంతేనని బీజేపి, అధికార టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వాన నీటిలో పూర్తిగా మునిగిపోయి సర్వం కోల్పోయిన తర్వాత పులిహార పొట్లాలు, పాల ప్యాకెట్లు ఇస్తే సరిపోదని తెలంగాణ బీజేపి, అధికార పార్టీపైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నగర పాలక సంస్ధ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో నగరం చుట్టూ ఉన్న జిల్లాల నాయకులు పాల్గొన్నారు. వర్షాకాలంలో పూడిక తీత పనులు, నాలాల చుట్టూ అక్రమ కట్టడాలు తొలగించాలని ధర్నాలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని బీజేపి నేతలు ఘాటుగా విమర్శించారు. జూన్ నెల సగం రోజులు పూర్తయినా నాలాల పూడిక తీత, అక్రమ కట్టడాలు కూల్చివేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
వానలు కురిన తర్వాత ముంపు ప్రాంతాలు మునిగిపోకముందే తక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ముందు ధర్నా చేపట్టిన మహిళా నాయకురాళ్లు డిమాండ్ చేశారు. సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజెప్పేక్రమంలో నగరపాలక సంస్థ ప్రధాన ద్వారం నుండి లోపలికి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేసారు బీజేపి నేతలు. దీంతో నగరంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డితో కలిసి బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య బీజేపినేతల ధర్నా కార్యక్రమం కొనసాగింది. నాలాల్లో పూడికతీత పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని మేడ్చెల్ అర్బన్ కమిటీ వైస్ ప్రసిడెంట్ సురభి శ్రావణి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు గేటు ఎక్కేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ కార్పొరేటర్లు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురుకాకూడదని, సత్వరమే నాలాల్లో పూడికతీతలు చేపట్టాలని డిమాండ్ చేసారు నాయకులు. బీజేపి నాయకులను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉండగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గాలలో పలు నాలాల పూడిక తీత పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాలాల ప్రక్షాలళన ఇప్పటినుండే చేపట్టాలని మేయర్ ఆదేశించడం కొసమెరుపు.