Chandrababu

 

నువ్వు చంపుతా ఉంటే.. చంపించుకుంటారా.?

 

🔹ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం..
🔹చంద్రబాబు ఆగ్రహం, రాష్ట్రపతి పాలనకు డిమాండ్
🔹నేడు ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు

 

అమరావతి (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుందని.. పోలీసు వ్యవస్థ, ముఖ్యమంత్రి కలిసి ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకాలు చూడలేదని.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడులను ఆయన ఖండిస్తూ అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో డీజీపీ, ముఖ్యమంత్రి ఇద్దరూ లాలూచీ పడి రాష్ట్రంలో ఒకే సమయంలో దాడులు చేయించారని చంద్రబాబు నాయుడు ఆగ్రహించారు. డీజీపీ ఆఫీస్‌కి వంద గజాల దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ సమస్య, గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహించారు. గంజాయితో జాతి నిర్వీర్యమవుతుంటే మాట్లాడే స్వేచ్ఛ తమకు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం డ్రగ్ మాఫియాకి కేంద్రంగా మారిందని చంద్రబాబు ఆరోపించారు. “రాష్ట్రంలోని అరాచకాలను ప్రశ్నిస్తే మనుషులను చంపేస్తారా.. నాయకుల మీద దాడి చేస్తారా.. నువ్వు చంపుతా ఉంటే చంపించుకుంటారా? రెండున్నర సంవత్సరాలుగా వేధింపులు అనుభవించాం. బాధ, ఆవేశాన్ని అణచుకుని ఉన్నాం. రౌడీలను తెచ్చి రాజకీయాలు చేస్తారా.. ఇలాంటి రౌడీలకు నేను భయపడను.. ప్రజలు భయపడరు.. తిరగబడతారు.. సవాల్ విసురుతున్నా ఎంత మందిని చంపుతావో చంపు” అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి ముందు డీజీపీకి ఫోన్ చేస్తే తీయలేదని.. దాడి సంగతి డీజీపీకి ముందే తెలుసని చంద్రబాబు నాయుడు అన్నారు. గవర్నర్‌కి ఫోన్ చేస్తే తీశారని.. కేంద్ర హోం శాఖ మంత్రికి ఫోన్ చేస్తే మాట్లాడారని.. వీళ్లందరికంటే డీజీపీ బిజీ పర్సనా అంటూ ప్రశ్నించారు. ప్రజల పన్నులతో డీజీపీగా ఉన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కాపడరా అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ ఆఫీస్‌కి దగ్గర్లో ఉండే టీడీపీ ఆఫీస్‌పై ఈ రకమైన దాడులు జరిగితే.. ఇంతకన్నా లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయ్యాయి అనడానికి ఉదాహరణలు ఇంకేముంటాయని ప్రశ్నించారు. ఆర్టికల్ 356 ఎందుకు ప్రయోగించకూడదో చెప్పమన్నారు. రాష్ట్రంలోని టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర ప్రజానీకం మొత్తం సహకరించాలని చేతులెత్తి వేడుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు.