నిరుద్యోగుల కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్
🔹జాబ్ క్యాలెండర్ పై జనసేనాని పోరాటం
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా పోరాటం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల నిరుద్యోగులు జనసేన పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న నేపథ్యంలో, నిరుద్యోగ యువత కోసం కార్యాచరణ రూపొందించారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ఈనెల 20వ తేదీన అన్ని జిల్లాల్లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చి భర్తీ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు లక్షల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వేలల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామంటున్నారని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో వైసీపీ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత ఇప్పుడు నిరుత్సాహ పడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
యువత ఎన్నో కష్టనష్టాలకోర్చి గత రెండేళ్లుగా ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షలకోసం సన్నద్ధమవుతున్నారు అని పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు జనసేన నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు జాబ్ క్యాలెండర్ లో పదివేల ఉద్యోగాలు మాత్రమే చూపడం కచ్చితంగా నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. గ్రూప్ వన్ , గ్రూప్ టూ లలో కేవలం 36 పోస్టులు మాత్రమే చూపించడం నిరుద్యోగులను వంచించటమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దాదాపు గ్రూప్ 1 , గ్రూప్ 2 లో సుమారు వెయ్యి ఖాళీ లకు పైగా ఉన్నట్లు గుర్తించి కేవలం 36 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం దేనికని పవన్ కళ్యాణ్ నిలదీశారు.ఉపాధ్యాయ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నాయని, ముఖ్యమంత్రి చెప్పిన మెగా డీఎస్సీ ఏమై పోయిందని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, పోలీస్ శాఖలో 7 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి లభించని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తిన ఆయన, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదని మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తీర్ణం కూడా సాగటం లేదని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు సుమారు 20లక్షల మంది వరకు పోటీపడతారని పోటీ పరీక్షల ఫీజుల రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ నిరుద్యోగుల ఆశలను కూడా ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.