KCR

 

వైఫల్యాన్ని ఒప్పుకున్నా” ముఖ్యమంత్రి కేసీఆర్”

 

🔹 రాష్ట్రం లో గంజాయి వినియోగం పెరిగింది

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు తొలిసారి తన వైఫల్యాన్ని అంగీకరిచినట్లుగా ఆవేదనాపూరిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలకు యువత పెద్ద సంఖ్యలో బలైపోతున్న తీరు కలచివేస్తున్నదన్నారు. ఆ బాధలోనే గంజాయి, ఇతర మత్తుపదార్థలపై ముఖ్యమంత్రి యుద్ధం ప్రకటించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సంచలన ఆదేశాలిచ్చారు.

🔹 డ్రగ్స్ మాఫియా తో హైదరాబాద్ కు లింకులు

🔹 యువత మత్తు బారిన పడడం భాదాకరం

🔹 గంజాయిపై యుద్దం చేయాలని అధికారులకు ఆదేశం

🔹 గంజాయిని అరికట్టి పేరు నిలబెట్టాలి

🔹 గంజాయి నిరోధానికి డీజీ స్థాయి అధికారి అధ్వర్యంలో  ప్రత్యేక విభాగం

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) పల్లెలు, పట్నాలనే తేడాలేకుండా గుండుంబా ఏరులైపారిన కాలంలో తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తన పాలన తొలి రెండేళ్లలో గుడుంబా నియంత్రణకు కేసీఆర్ విశేష కృషి చేశారు. గుడుంబా తయారీపైనే బతికిన కొన్ని కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కూడా కల్పించారు. అదే సమయంలో కల్తీ కల్లును పూర్తిగా నివారించి, ప్రభుత్వ కల్లు దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే కాలం గడుస్తున్నకొద్దీ ఆయన ఫోకస్ అభివృద్దివైపు మళ్లగా, రాష్ట్రంలో మత్తు దందా మళ్లీ పుంజుకుంది. ఎక్కడికక్కడ రాజకీయ జోక్యాలు పెరిగిపోవడంతో గంజాయి, డ్రగ్స్ మాఫియాలు చాపకింద నీరులా పున:విస్తరించి, ఇప్పుడు బ్రహ్మరాక్షసిలా మారాయి. గంజాయి లాంటి మత్తు పదార్థాల వాడకంలో తెలంగాణ ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. గుండెబరువుతోనే గంజాయి నియంత్రణపై సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చానని అన్నారు. తద్వారా ఏదైనా అంశంపై తొలిసారి ఆయన వైఫల్యాన్ని అంగీకరించినట్లయింది..

🔹డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ లింకులు

తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం డ్రగ్స్ కు అడ్డాగా మారిందని, గుజరాత్, గోవా కేంద్రంగా పనిచేస్తోన్న మాఫియాకు హైదరాబాద్ తో లింకులు ఉన్నాయని, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దాడుల్లో అరెస్టయిన వ్యక్తుల్లో హైదరాబాదీలు ఉండటం, సిటీ శివారుల్లోని కొన్ని ఫ్యాక్టరీల్లో డ్రగ్స్ తయారవుతున్నట్లు వెల్లడికావడం, నిన్నటికి నిన్న హైదరాబాద్ లో ఒకే వ్యక్తి దగ్గర ఏకంగా 40కిలోల గంజాయి పట్టపడటం తదితర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి తెలంగాణ ఎక్సైజ్, పోలీస్ శాఖల ముఖ్య అధికారులంతా హాజరయ్యారు.

🔹గంజాయి వినియోగం పెరిగిందని ఆవేదన

మత్తు పదార్థల కట్టడిపై జరిగిన రివ్యూ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి వినియోగం భారీగా పెరిగిందని, ఎంతో ఆవేదనతోనే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశానని, అమాయకులైన యువకులు ఎంతో మంది మత్తు బారినపడుతుండటం బాధాకరమని బరువైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో గంజాయిపై యుద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు..

🔹స్పెషల్ సెల్.. స్టూడెంట్స్‌పై నజర్..

గంజాయి, ఇతర మత్తుపదార్థాలతో సంబంధమున్న నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని కేసీఆర్ అన్నారు. అంతేకాదు, గంజాయిని పూర్తిగా నిరోదించేందుకు తెలంగాణలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దానికి డీజీ స్థాయి అధికారిని చీఫ్ గా నియమించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రత్యేక సెల్ ప్రధానంగా విద్యాసంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. తద్వారా యువతను మత్తుమార్గం నుంచి కాపాడినట్లవుతుందన్నారు. అదే సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులకు దేశంలో మంచి పేరు వచ్చిందని, డ్రగ్స్ ను సమూలంగా అరికట్టి ఆ పేరును నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.