బీజేపీ అంటే అమ్మకం.. టీఆర్ఎస్ అంటే నమ్మకం
ఈటలపై మండిపడ్డ హరీశ్ రావు
హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని హరీశ్ రావు అన్నారు. పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్య జరుగుతోందని అన్నారు.
హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం రాజీనామా చేశారన్న మంత్రి హరీశ్ రావు.. అసలు ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని అన్నారు. ప్రజలు బాగుపడాలో లేక ఈటల బాగుపడాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయని ఈటల రాజేందర్.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని అన్నారు. హుజూరాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్య జరుగుతోందని హరీశ్ రావు అన్నారు. ఎవరు గెలిస్తే నియోజకవర్గానికి లాభం జరుగుతుందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. రాబోయే ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కకుండా చేయాలని హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్‌కు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. వీణవంక మండలంలోని ఏ గ్రామానికి కూడా బండి సంజయ్ రూ. 10 లక్షలు ఖర్చు చేయలేదని ఫైర్ అయ్యారు. తాను దత్తత తీసుకున్న రామకృష్ణాపూర్‌కు బండి సంజయ్ రూపాయి పని కూడా చేయలేదని ఆరోపించారు. అసహనంతో ఈటల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయన తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. బీజేపీ అమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారితే… టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. ప్రజల కష్టం తన కష్టంగా భావించే గొప్ప నేత సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఈటలకు రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగిలో ఎన్ని వడ్లు పండినా కొంటామని కేంద్రంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరి సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని తెలిపారు.