Jobs

 

ప్రభుత్వ ఉద్యోగాలు అసాధ్యం..?

 

* అసెంబ్లీ సాక్షిగా తేల్చేసిన కేటీఆర్‌
* టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల ఆగ్ర‌హం
* ఏ ప్రభుత్వమైనా రెండు శాతానికి మించి ఉద్యోగావకాశాలు కల్పించలేదు
* గత ఏడేళ్ళలో ఈ ప్రభుత్వం రెండు శాతం ఉద్యోగాల కల్పన గీటురాయి దాటిందా.?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) అప్పొజిషన్లో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఏకిపారేయడం.. అధికారం అనుభవిస్తున్నప్పుడు నీతిపాఠాలు బోధించడం లాంటివన్ని రాజకీయాాల్లో ఆరితేరిన వాళ్లకు మామూలే. అయితే ప్రజల్లో పలుచ నైపోతామని గానీ, తమ పరువు తామే తీసుకుంటున్నామని గానీ గుర్తించకపోవడమే వీళ్లు చేస్తున్న అతిపెద్ద తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ  అసలు విషయమేంటంటే తెలంగాణ రాష్ట్ర యువ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు ఓ వీక్ పాయింట్‌ ను బయట పెట్టారు. అది కూడా శాసనసభా ముఖంగా మిత్రపక్షాలు, శత్రుపక్షాలు కళ్లప్పగించి చూస్తుండగా, చెవులప్పగించి వింటుండగా అసలు విషయాన్ని కక్కేశారు. అదేంటంటే ఏ ప్రభుత్వమైనా 2 శాాతానికి మించి ఉద్యోగావకాశాలు కల్పించలేదని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అసలు విషయాన్ని ఏమాత్రం దాచుకోకుండా, తడుము కోకుండా చెప్పేశారు. ఈ మాటలు అంటున్నప్పుడు కేటీఆర్ లో ప్రతిపక్షాలు ఏమంటాయన్న భయంగానీ, స్వపక్షాలకైనా ఏం చెబుతామన్న సందేహా స్పద స్థితి గానీ, పోనీ ప్రజలు, మీడియాఅడిగితే ఎలా సమర్థిచుకోవాలనే ఆలోచన గానీ కనిపించక పోవడం విశేషం. అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ కోసం వెచ్చిస్తున్న భారీ ఎత్తున నిధులు, హైదరాబాద్ అభివృద్ధి  కోసం ఏం చేస్తే బాగుంటుందో తీసుకుంటున్న సూచనలపై కేటీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా కేటీఆర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని నాల్గవ ప్రపంచ పారిశ్రామిక విప్లవంగా అభివర్ణించారు.  ఇప్పుడు తెలంగాణ జనాభా సుమారు 4 కోట్లు అనుకుంటే అందులో ఓవరాల్ గా 2 శాతానికి మించి ప్రభుత్వ  ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు కల్పించలేమన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది కొత్తతరం ఉన్నత చదువులు చదువుకొని యూనివర్సిటీ ల్లోంచి బయటి కొస్తున్నారని, వారందరికీ ఉద్యోగాలిచ్చే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. తన వాదనకు సమర్థనగా  కేంద్రంలోని మోడీ సర్కారును కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవడం విశేషం. ఇటీవల మోడీ చేసిన అమెరికా టూర్ లో బైడెన్ ని కలవకముందు పలు కంపెనీల సీఈవోలతో విడివిడిగా భేటీ అయ్యారని మన దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నా, రేపు మరో ప్రభుత్వమే వచ్చినా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించక తప్పదన్నారు. మోడీ క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో అమన్ ను కలిసిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. డిజిటల్, 5జి, సోలార్ పవర్ వంటి అనేక రంగాల్లో భారత్ లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు న్నాయని, అందులో తెలంగాణకు మరింత స్కోప్ ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రైవేట్ కంపెనీల వ్యాపారాలకు సహకరిస్తేనే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేటీఆర్ ఇండైరెక్టుగా తేల్చిచెప్పారు.  అంతేకాదు ఇంక్లూసివ్ గ్రోత్ అంటే సర్వజన సమ్మిళిత మైన అభివృద్ధి కోసం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారని, వారిద్దరి మధ్య అతి అరుదుగా ఏకాభిప్రాయాలు వస్తుంటాయని, రాష్ట్ర అభివృద్ధిలో వారు ఏకాభిప్రాయం సూచించడమే గాక ఆ కార్యంలో తాము భాగస్వాముల మవుతామని చెప్పడం ఆనందంగా ఉందంటు ఆ రెండు పార్టీల మద్దతు ఎంతో ముందుచూపుతో లాక్ చేశారు. అయితే రాష్ట్రంలో ఉన్న వాస్తవమైన పరిస్థితులను బయటపెట్టే ఉద్దేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినా కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్, ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చే విమర్శనాస్త్రాలను మాత్రం విస్మరించారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తండ్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యానాల పర్యవసానాలు కూడా కేటీఆర్ పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో అధికార బాధ్యతలేవీ లేని వ్యక్తిగా కేసీఆర్ ఏటా దాదాపు 2 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని చెప్పారు. కానీ అది చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు నిండా విమర్శనాస్త్రాలు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా కేటీఆర్ రెండు శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేమంటూ కొత్త సూత్రీకరణ చేసినా అది కూడా ఆచరణ సాధ్యం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన మాటల ప్రకారమే తెలంగాణ జనాభా ఉజ్జాయింపుగా 4 కోట్లు అనుకున్నా అందులో 2 శాతం అంటే 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమవుతుందని, అంతకుమించి ఇవ్వడం సాధ్యమయ్యే  పని కాదని తేల్చేశారు. మరి కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టాక 2 శాతం (8 లక్షల ఉద్యోగాలు) ఉద్యోగాలు కల్పించారా అంటే లేదనేదే సమాధానం. ఇప్పటికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే చిన్నా, చితకా ఉద్యోగాలు కూడా కలుపుకున్నా 3 లక్షలకు మించలేదని నిరుద్యోగ సంఘాలు విమర్శిస్తు న్నాయి. ఈ ఏడేళ్లలో ఉద్యోగాల కల్పన 2 శాతానికి  కూడా చేరలేేదని తేలిపోతుంది. మరి కేటీఆర్ ఏ లెక్క ప్రకారం 2 శాతం సాధ్యమవుతుందంటున్నారు.. పోనీ ఆ 2 శాతమైనా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్తారా అంటున్నారు నిరుద్యోగులు.  ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రైవేట్ రంగాన్ని మించింది లేదని చెప్పడం ఒక్కటే  కేటీఆర్ ఆంతర్యం తప్ప ప్రభుత్వం తరఫున కల్పించే లెక్కను పూరించడం కాదన్న చమత్కారాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల దళిత బంధును ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కేసీఆర్ కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద మందిని ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కొందరికి చెక్కులు ఇచ్చారు. వాటి నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా దళితులకు మూడు ఎకరాల్లాంటి హామీయే తప్ప మరోటి కాదని మందకృష్ణ మాదిగ సహా ఇతర మేధావులంతా విమర్శిస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఏ ఆధారంతో రెండు శాతం ఉద్యోగాలు సాధ్యమవుతుందన్నారో  తెలియడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కేటీఆర్ నోరు జారారా లేక బ్యాగ్రౌండ్ లో ఏమైనా హోం వర్క్ చేసే మాట్లాడారా లేక ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు కూడా అలాంటి హామీలే గతంలో ఇచ్చాయి కాబట్టి తన వ్యాఖ్యల వైఫల్యాన్ని ఎండగట్టరు అన్న ధీమాతోనే అలా మాట్లాడారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.