Modi & Jagan

 

బీజేపీ-వైసీపీ మధ్య గ్యాప్ కు కారణమేంటి.?

 

🔹కేబినెట్ భేటీలో సీఎం క్లారిటీ ఇచ్చారా..? క్లాస్ పీకారా..?

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిందా. ఇంతకాలం దోస్తీతో మెలిగిన ఈ రెండు రాజకీయ పార్టీల మద్య విబేధాలు తారా స్థాయికి చేరడానికి కారణం ఏంటి..? రాష్ట్ర కేబినెట్ భేటీలో బీజేపీ రాజకీయాలపై చర్చ జరిగింది అంటే.. పరిస్థితి అంతాలా ఎందుకు మారింది.. ఇన్ సైడ్ టాక్ ఏంటి..?

 

అమరావతి (ప్రశ్న న్యూస్) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉందన్నది మొన్నటి మాట.. ఇప్పుడు పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. అందుకు తాజాగా కేబినెట్ భేటీ నిదర్శనమనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ అధికారాంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్రంతో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. మొదటిలో ఎలా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ కేంద్రం నుంచి సహకారం రావడం లేదు. ప్రత్యేక హోదా, పోలవరం లాంటి విభజన సమస్యలను పక్కన పెడితే.. రాష్ట్రానికి అవసరమైన నిధులు కూడా ఇవ్వడం లేదు. అప్పులు చేసుకునేందుకు కూడా స్వేచ్ఛ ఇవ్వడంలేదని ప్రభుత్వ వర్గాలే పలు మార్లు చెప్పాయి. కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి తీవ్ర నిరాశ మిగిలింది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు. అయితే ప్రతి విషయంలోనూ కేంద్రానికి బహిరంగంగానే మద్దతు తెలుపుతూ వచ్చింది. కరోనా సెకెండ్ వేవ్ కష్టకాలం, వ్యాక్సినేషన్ సమయంలోనూ కేంద్రానికి మద్దతుగా నిలవాలి అంటూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం జగన్ సూచించారు. ఒకటేంటి ఇలాంటి ఎన్నో సంఘటనలు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహబంధానికి ఉదహరణలుగా నిలుస్తాయి. కానీ సడెన్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాయిస్ మారిపోయింది. తాజాగా ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే స్వయంగా మంత్రి పేర్ని నాని బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మతను దించేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోంది అన్నారు. ఇటీవల ఎంపీ విజయసాయి సహా ఇతర ఎంపీలు సైతం కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని ముందే పార్లమెంట్ లో వైసీపీ నేతలు నిరసన గళం వినిపించారు. ఈ పరిణామాలతో కేంద్రం-రాష్ట్రం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ నేరుగా ఇద్దరు బీజేపీ నేతల పేర్లు ప్రస్తావించారనే టాక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కేంద్రం, మరోవైపు కాగ్, ఇంకో వైపు ప్రసార మాధ్యామాల్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై వస్తున్న వరుస కథనాలు ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనివ్వడంలేదు. అందుకే ముఖ్యమంత్రి తన అసహనాన్ని కేబినెట్ లో మంత్రి వర్గ సహచరుల ముందు బయటపెట్టిన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై బీజేపీ నేతలు ఎలా మాట్లాడుతారని కేబినెట్ భేటీలో జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కేంద్రం అప్పలు చేయకుండా ఉంటే.. తమను ప్రశ్నించడంలో అర్థం ఉందని.. కానీ కేంద్రమే లక్షల కోట్లు అప్పలు చేస్తూ తమను ఎలా ప్రశ్నిస్తుందని సీఎం జగన్ నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని మంత్రి పేర్ని నాని మంత్రి మండలి తరువాత జరిగిన మీడియా సమావేశాలంలో సైతం ప్రస్తావించారు.

సుమారు మూడున్నర గంటల పాటు జరిగిన ఏపి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. నాన్ ఎజెండా అంశాలపైనే హట్ హట్ గా చర్చ జరిగింది. రాష్ట్ర ‎ఆర్ధిక పరిస్ధితిపై కేంద్ర ఆర్దిక శాఖ రాసిన లెఖ కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అసలు ఏపి అప్పుల విషయం కేంద్రం ఎలా మాట్లాడుతుందని మంత్రి మండలిలో ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం అప్పులు చేయకుండా ‎ఉంటే తమను ప్రశ్నించొచ్చనే భావన కేబినెట్ లో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కాషాయ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారంటూ వ్యాఖ్యనించడం కలకలం రేపుతోంది. అసలు ఉన్నట్టుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది. మంత్రుల స్వరం ఎందుకు మారింది అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు కేంద్రం పై మంత్రిమండలిలోనే అసహనం వ్యక్తం కాగా, మరోపైపు మంత్రులను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. ఇటివల కాలంలో ముగ్గురు మంత్రులు చాలా ఇన్ యాక్టివ్ అయ్యారని సీఎం అన్నట్టు తెలుస్తోంది. తాను ప్రతి అంశాన్ని స్టడీ చేస్తానని అన్న సిఎం జగన్ కొందరు మంత్రుల పేర్లు పెట్టిమరీ మందలించినట్టు సమాచారం. ఇటీవల కాలంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోందని, విమర్శలకు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ను చూపించడంతో అందరూ దాన్ని నమ్మే పరిస్థితి వస్తోందని మంత్రులతో సీఎం అన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలు అటు జనంలోకి వెళ్లిపోతున్నాయని. మీరు ఎందుకు వాటిని గట్టిగా కౌంటర్ చేయలేక పోతున్నారని సిఎం వారిని ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే విధంగా ప్రజల్లోకి ఇష్యూలు వెళితే మనం ఇబ్బంది పడాల్సి వస్తోంది సిఎం ప్రస్తావించారని చెపుతున్నారు.

ముఖ్యంగా బీజేపీకి చెందిన ఇద్దరు నేతల పేర్లును ప్రస్తావిస్తూ వారు మాట్లాడుతుంటే మీరెందుకు కౌంటర్ చేయడం లేదని సిఎం మంత్రులను తీవ్ర స్వరంతో మందలించినట్టు తెలుస్తోంది. మీరు ఇలానే ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయని సీరియస్ అయినట్టు సమాచారం. అలాగే పులిచింతల గేట్లు విషయంలో కౌంటర్ చేయలేకపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతలు అరెస్టైతే ప్రతిపక్షం నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పుకోవడంలో వారు సఫలం అయ్యారని. ఇలాంటి అంశాలను మంత్రులు సరిగా డిఫెండ్ చేయడం లేదన్నారు. చివరకు ఈ అంశాలను కూడా ప్రభుత్వం డిఫెండ్ చేయాల్సి వస్తోందన్నారు. ఇటీవల టీడీపీ నాయకుడిని అరెస్టు చేస్తే ఆవిషయంలోనూ అన్యాయంగా అరెస్టు చేసినట్టు ప్రచారం జరిగిందని అలాంటి అంశాల్లో కూడా ఎందుక ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారని సిఎం అన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ రావాడానికి ఎంపీ రఘురామ వేసిన బెయిల్ పిటిషన్ కారణమనే మరో ప్రచారం ఉంది. ఈ నెల 25న దీనిపై తుది తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఇదంతా కేంద్రానికి తెలిసే జరుగుతోందని.. అందుకే సీబీఐ అధికారులు కోర్టులో చేతులెత్తేశారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఇలానే మెత్తగా ఉంటే.. బయట జరుగుతున్న ప్రచారమే నిజమవుతుందని.. బీజేపీ రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పీకే నుంచి కూడా వైసీపీ సంకేతాలు అంది ఉంటాయని.. బీజేపీకి దూరంగా జరిగి.. కేంద్రానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న కూటమిలో జగన్ ను చేర్చాలని ఆయన ఆరాటపడుతున్నట్టు ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఇది కూడా బీజేపీపై స్వరం మార్చడానికి కారణని భావిస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ఏపీలో ఆకస్మిక పర్యటన కూడా పలు అనుమానాలు పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.