అమ్మవారి నవదుర్గల అవతారాల్లో రెండో అవతారం బ్రహ్మచారిణి
2. బ్రహ్మచారిణి
బ్రహ్మచారిణి దేవి: రెండవ రోజు దుర్గాదేవిని ‘ఉమ’ లేదా ‘బ్రహ్మ చారిణి’ అనగా శ్రీ అన్నపూర్ణాదేవిగా, ఆకుపచ్చని కలర్ తో అలంకరిస్తారు. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ది విజయాలు ప్రాప్తిస్తాయి.
‘బ్రహ్మచారిణి’ యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది. కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును. తరువాత నైవేద్యం రూపంలో పంచదారను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. ఈ బ్రహ్మచారిణి అమ్మవారికి మల్లెపూలంటే చాలా ఇష్టం. ఈ మాతను తాజా మల్లెపూలతో పూజిస్తే సర్వత్రా సిద్ధి విజయాలు లభిస్తాయట. ఈ సమయంలో అమ్మవారిని ఈ మంత్రంతో పూజించాలి.
మంత్రం :
“ఓం దేవి బ్రహ్మచారిన్యై నమః “
బ్రహ్మచారిణి ధ్యాన శ్లోకం :
“దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥“