Tonique Liquor Scam

Tonique Liquor Scam

టానిక్ లిక్కర్ స్కాం

-వెలుగులోకి మరో లిక్కర్ స్కాం..

-ఒక్క లైసెన్స్తో 11 వైన్ షాపులు..

-బీఆర్ఎస్ నేతలే ఓనర్స్..

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం వివాదం కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు మరో కొత్త లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ పెద్దల అండతో స్పెషల్ జీవోలు విడుదల చేసి మరీ వందల కోట్ల ట్యాక్స్ ఎగవేసిన బడా కుంభకోణం బయటకు వచ్చింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న టానిక్ ఎలైట్ వైన్ షాపులో జీఎస్టీ అధికారులు చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్కు ఉన్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టానిక్కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు.

అయితే ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన ఒక్క లైసెన్స్ కింద ఏకంగా 11 మద్యం దుకాణాలు నడిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం నగరంలో టానిక్కు 11 ఫ్రాంచైజ్లు ఉండగా క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. తెలంగాణలో ఏ వైన్ షాప్కు లేని ప్రత్యేక అనుమతులు కేవలం టానిక్కు మద్యం దుకాణానికి మాత్రమే ఉండటం గమనార్హం. ఈ మేరకు ప్రత్యేక జీవోను కూడా గత ప్రభుత్వం విడుదల చేసింది. ‘టానిక్/Tonique’ వైన్ షాప్కి రాష్ట్రంలో ఏ డిపో నుంచైనా మద్యం తీసుకునే వెసులుబాటుతో పాటు దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెచ్చుకుని టానిక్ లో విక్రయించుకునేలా అనుమతులు ఇచ్చారు.

Also Read : చైనా ఉప్పును నిరాటంకంగా ఉపయోగించడం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది.

విదేశీ మద్యం అమ్మకానికి 2016లో గత ప్రభుత్వం ప్రత్యేక జీవోతో అనుమతి ఇవ్వగా 2017లో అమ్మకాలు మొదలు పెట్టారు. అయితే ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది. ఇందులో ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారితో పాటు ఓ ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్నా ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.

ఇందుకు ప్రధాన కారణం టానిక్ ఎలైట్ వైన్ షాప్ యజమానులుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ ఉండటమేనని అధికారులు గుర్తించారు. ఏడేళ్ల పాటు మద్యం విక్రయాల లెక్క తీస్తే ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారో బయట పడుతుందని జీఎస్టీ అధికారులు లెక్కలేస్తున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవటంతో బీఆర్ఎస్ నేతలు తమ వాటాలు వేరే వ్యక్తులకు అమ్ముకున్నట్టు సమాచారం. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా దాడులు చేయగా యజమానులు వాళ్లు కాదని తేలటంతో అవాక్కవటం అధికారుల వంతైంది.

దీంతో టానిక్తో పాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని మద్యం షాపుల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ, వ్యాట్ ఎగవేత కోణాలతో పాటు మద్యం బదిలీ, పన్ను చెల్లించని మద్యం అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ దుకాణం ద్వారా ఆంధ్రప్రదేశ్కు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. అయితే తాము మాత్రం నిబంధనలకు లోబడే వ్యాపారం నిర్వహిస్తున్నట్టు టానిక్ సంస్థ చెప్తుండటం గమనార్హం. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చింది. ఈ కుంభకోణంలో ఎంత మంది పేర్లు బయటికోస్తాయో ఎన్ని వందల కోట్ల స్కాం బయటపడుతుందో వేచి చూడాల్సిందే.