Revanth

 

మోదీకి అండగా కేసీఆర్, నోరెత్తని టీఆర్ఎస్

 

🔹మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదంటూ రేవంత్ వ్యాఖ్యలు
🔹అందుకే తెలంగాణకు అన్యాయమంటూ రేవంత్ ఫైర్

 

న్యూఢిల్లీ/హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆరోపించారు. మోదీ వ్యతిరేక శక్తుల సమీకరణ కోసం మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో 14 ప్రతిపక్ష పార్టీలు వచ్చాయని తెలిపారు. నీళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఏపీ దాదాగిరి చేస్తుందని కేసీఆర్ అన్నారని.. అయితే, ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏనాడూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది లేదని రేవంత్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ఎంపీలు కలిసి రాలేదని రేవంత్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి టీఆర్ఎస్ రాకుండా.. నరేంద్ర మోదీకి స్పష్టమైన మద్దతును కేసీఆర్ ప్రకటించారని అన్నారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదన్న రేవంత్ రెడ్డి.. బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్‌గా టీఆర్ఎస్ పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మోడీకి లొంగిపోయారని, అందుకే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రేవంత్ అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్రను రద్దు చేకున్నారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజే జోగినిపల్లి సంతోష్.. రాజ్యసభ సభ్యులతో కలిసి మోదీని కలిశారన్నారు. ఆ సమావేశాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో జోగినిపల్లి సంతోష్ ఏకాంతంగా భేటీ అయ్యారని.. మరి మీ అవినీతి చిట్టా ఉందని మోడీ కాళ్ల మీద పడ్డారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీతో దిగిన ఫొటోలు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలు, పెండింగ్ నిధులు, కేంద్రం గెజిట్ తోపాటు ఏ అంశాలనూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించడం లేదన్నారు రేవంత్ రెడ్డి.