మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు
ఏ చట్టం ఎందుకో తెలియట్లే
పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదన
కోవింద్, మోదీకి భిన్నంగా రమణ ప్రసంగం
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మొదలుకొని దేశవ్యాప్తంగా గల్లీగల్లీలో జరిగిన సంబురాల్లో జయజయ ధ్వానాలే తప్ప ఆత్మావలోకనం, ఆత్మవిమర్శ లేదని లోటును పూడ్చుతూ భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో శాసన వ్యవస్థ కునారిల్లుతోన్న తీరును, పార్లమెంట్ సాక్షిగా దేశానికి జరుగుతోన్న నష్టాన్ని సీజేఐ ఎకరువుపెట్టారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) ఎన్వీ రమణ ఆదివారం నాడు సుప్రీంకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీజేఐ రమణ.. జెండా వందనం తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంటును నడుపుతోన్న పనితీరుపై ఘాటైన విమర్శలు చేశారు. నెహ్రూ, ఆ తర్వాతి హయాంలలో పార్లమెంటు సమావేశాలు అర్థవంతంగా జరిగాయని గుర్తు చేశారాయన. స్వాతంత్ర్య దినోత్సవం వేళ సీజేఐ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతిఏడాది ఎర్రకోట వేదికపై ప్రధానమంత్రులు చేసే ప్రసంగాలు ఐ-డేకు ప్రత్యేకంగా ఉంటూండగా, ఈసారి మాత్రం సీజేఐ రమణ ప్రసంగం సంచలనంగా మారింది.
‘‘ఒకప్పుడు పార్లమెంటులో ఒక బిల్లు లేదా చట్టం తీసుకొచ్చారంటే, దానిపై లోతైన, సుదీర్ఘ, విమర్శనాత్మక చర్చ జరిగేది. ఆ చట్టాల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు, ఉపయోగం కలుగుతాయో సభ ద్వారానే అందరికీ తెలిసేది. తద్వారా సదరు చట్టాలపై ఏవైనా చిక్కు ముడులు ఏర్పడితే పరిష్కరించడం కోర్టులకు కూడా సులువయ్యేది. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు. సారీ స్టేట్ అఫ్ అఫైర్స్ (అత్యంత దురదృష్టకరమైన కలవరపెట్టే) పరిస్థితులు దాపురించాయి. ఇవాళ పార్లమెంటులో ఆమోదం పొందుతోన్నవాటిలో ఏ చట్టం ఎందుకో, దాని ప్రయోజనాలేమిటో, ఎవరికీ అర్థం కాకుండా ఉంది. కనీస చర్చ లేకుండా ఆఘమేఘాల మీద ఆమోదం పొందుతోన్న చట్టాల వల్ల ప్రజలకు కచ్చితంగా అసౌకర్యం ఏర్పడుతుంది. చట్టాల్లో ఎన్నో లోపాలు ఉంటుండటం వలన, కోర్టుల్లో వ్యాజ్యాలు పెరుగుతున్నాయి. ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి ఏ చట్టం ఎందుకో, ఎవరికి ఉపయోగమనే అవగాహన కూడా లేకుండా పార్లమెంటులో గందరగోళం ఏర్పడటానికి.. ప్రస్తుతం ఎన్నికవుతోన్న సభ్యులు ఎవరనేది కూడా ఒక కారణమే. గతంలో చట్టసభలకు మేధావులు, లాయర్లు అత్యధికంగా ఎన్నికయ్యేవారు. మన స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్.. వీరంతా లాయర్లు, న్యాయశాస్త్ర కోవిదులే. చాలా కాలంపాటు పార్లమెంటులో లాయర్ నేతల సఖ్య ఎక్కువగా ఉండేది. తద్వారా పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరిగేవి. కానీ ప్రస్తుత కాలంలో సభలో అలాంటి వాళ్లు లేకపోబట్టే దురదుృష్టకర పరిస్థితులు తలెత్తాయి.
ఇవాళ చట్ట సభలు గందరగోళంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మన మన విజయాలు, విధానాలను సమీక్షించుకోవాలి. ఎందుకంటే, ఒక స్వతంత్ర దేశ చరిత్రలో 75 సంవత్సరాలు చిన్న విషయమేమీ కాదు. మా చిన్నతనంలో స్వాతంత్ర్య వేడుకలో పాల్గొంటే చిన్న జెండాను, చిన్న బెల్లం ముక్కను ఇచ్చేవారు. ఇన్నేళ్ల తర్వాత మనం చాలా పొందుతున్నాం. కానీ సంతృప్త స్థాయి( సాచురేషన్ లెవెల్స్) మాత్రం అట్టడుగుకు చేరింది. దీనిపై మనందరం ఆత్మావలోకనం చేసుకోవాలి. ఈ సందర్భంగా లాయర్లకు నేనొక విషయం చెప్పదలిచాను.. ఎంతసేపూ డబ్బులు సంపాదించి, హాయిగా బతకేయాలని అనుకోకండి. సాధ్యమైనంతలో ప్రజాసేవ చేయండి, ఈ దేశానికి కూడా మీ జ్ఞానం, విజ్ఞానాన్ని అందించండి..” అని సీజేఐ రమణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీజేఐ రమణ చేసిన ప్రసంగం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. పదవి చేపట్టిన తొలిరోజు నుంచే వివిధ అంశాల్లో మోదీ సర్కారుకు చెక్ పెడుతూ వస్తోన్న రమణ.. ఇవాళ ఏకంగా చట్ట సభల తీరును తప్పు పట్టడం, చట్టాలపై అవగాహన, చర్చ లేకుండానే ఆమోదిస్తున్నతీరును గర్హించడం కీలకంగా మారింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోదీ సర్కారు రికార్డు సమయంలో బిల్లుల్ని ఆమోదించుకోవడం, చర్చకుగానీ, విపక్షాల అభ్యంతరాలకుగానీ అవకాశం ఇవ్వని దరిమిలా సీజేఐ వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధంలా మారాయి. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో సరాసరి కేవలం 7 నిమిషాల వ్యవధిలో ఏకంగా 12 కీలక బిల్లులు ఆమోదం పొందడంపై విపక్షాలు చేస్తోన్న విమర్శలకు సీజేఐ వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చినట్లయింది. రాజ్యసభలో నావిగేషన్ బిల్లు 8 నిమిషాల్లో, జువెనైల్ జస్టిస్ బిల్లు 5నిమిషాల్లో, ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ బిల్లు 7 నమిషాలు, కొబ్బది అభివృద్ధి బిల్లు ఒకే ఒక్క నిమిషంలో ఆమోదం పొందగా, లోక్ సభలో ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ బిల్లు 13 నిమిషాల్లో, నేషనల్ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ బిల్లు 6 నిమిషాల్లో, దివాళ కోడ్ బిల్లు 5 నిమిషాల్లో, గ్రాంట్స్ పెంపు బిల్లు 9 నిమిషాల్లో, అప్రాప్రియేషన్ బిల్లు 3 నిమిషాల్లో, అంతర్గత నిఘా బిల్లు 6 నిమిషాల్లో, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ రెగ్యులేషన్ బిల్లు 14 నిమిషాల్లో ఆమోదం పొందడం తెలిసిందే.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, పార్లమెంటు దేశ ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజా శ్రేయస్సు కోసం చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు పార్లమెంటు అత్యున్నత వేదిక అని చెప్పారు. ‘మన దేశం స్వాతంత్య్రం సాధించినప్పుడు అదెంతో కాలం మనలేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ పూర్వకాలం నుంచే ఈ నేలలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్నదని వారికి తెలియదు’ అని రాష్ట్రపతి చెప్పగా, ఎర్రకోటపై జెండా ఎగరేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రజల జీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా బీజేపీ సర్కారు పనిచేస్తున్నదని, దేశ సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతో అవసరమని, భారీ సంస్కరణలకు కావాల్సిన రాజకీయ సంకల్పానికి ఇప్పుడు భారత్‌లో కొదవలేదని చెప్పారు. అయితే, సీజేఐ రమణ ప్రసంగం మాత్రం రాష్ట్రపతి, ప్రధాని చేసినవాటికి పూర్తి భిన్నంగా, దాదాపు విమర్శనాత్మకంగా, ఆత్మావలోకనం చేసుకోవాలన్న హితవులతో సాగడం గమనార్హం. గతంలో పార్లమెంటులో చర్చల నాణ్యత అద్భుతంగా ఉండేదని, పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంటులో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని, అప్పట్లో తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) సభ్యుడు రామ్మూర్తి ఎంతో విపులంగా ఆ బిల్లును విశ్లేషించారని జస్టిస్ట్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంట్‌లో కరువైందని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. సీజేఐ వ్యాఖ్యలపై పార్టీల స్పందన వెలువడాల్సి ఉంది.