ECI

 

దళితబంధును నిలిపేయండి

 

* కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడి నియోజకవర్గ పరిధిలో దళితబంధును వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది.  మంగళవారం మధ్యాహ్నం 2 గంటల కల్లా దీనిపై నివేదిక అందజేయాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు లేఖ అందింది.
ఉప ఎన్నిక తర్వాత దళిత బంధును యథావిధిగా కొనసాగించ వచ్చునని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈనెల 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. ఎన్నిల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలేమి అమలు చేయడానికి వీలుండదు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే ఆ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దళిత బంధు పథకాన్ని ఉప ఎన్నిక పూర్తి అయ్యేంతవరకు అమలు చేయకూడదని లేఖలో పేర్కొంది. ఉపఎన్నిక అనంతరం ఎప్పటిలానే పథకాన్ని కొనసాగించు కోవచ్చునని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రవాప్తంగా దళితబంధు పథకం అమల్లో ఉన్నప్పటికీ ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఈ పథకం నిలిచేపోనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గానికి మాత్రమే మేలు చేసేలా ఈ దళితబంధును ప్రవేశపెట్టిందంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ఈ పథకం ప్రారంభించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి కల్పన కోసం.. 30 రకాల పథకాలను, కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో పొందుపరిచింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఉపఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేసింది. అయితే, ఈసీ ఆదేశాలతో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ పథకం నిలిచిపోనుంది. కాగా, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. అక్టోర్ 30న ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఉపఎన్నికలో ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ఉండనుంది.