revanth

 

మోసానికి మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వానివి దొంగ లెక్కలు…

 

🔹ఉద్యోగాల ఖాళీలపై రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో ప్రభుత్వ కొలువుల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతోంది. 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన ప్రభుత్వం.. ఏడు నెలలుగా దాన్ని సాగదీస్తోంది. తాజా కేబినెట్ సమావేశంలో 56,979 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదిక అసమగ్రంగా ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని పక్కనపెట్టేశారు. ఐదు రోజుల్లో సమగ్ర వివరాలతో మరో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నోటిఫికేషన్ల పేరుతో అలా ఆశలు రేకెత్తించడం… ఆ వెంటనే ఆశలపై నీళ్లు చల్లేలా వ్యవహరించడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఉద్యోగాల ఖాళీల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలను విపక్షాలు తప్పు పడుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల ఖాళీల లెక్క మోసానికి మాస్టర్ ప్లాన్ అని విమర్శించారు. గతేడాది డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖాళీల సంఖ్య 56వేలు దాటడం లేదంటూ దొంగ లెక్కలు చెప్పడమేంటని ప్రశ్నించారు. వివిధ కార్పోరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీసి.. అన్నింటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేబినెట్ భేటీలో ఆర్థిక శాఖ సమర్పించిన ఖాళీల వివరాల ప్రకారం… 28 ప్రభుత్వ శాఖల్లో 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 44,022 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కాగా 12,957 పోస్టులు ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్నాయి. అత్యధికంగా పోలీస్ శాఖలో 21,507 డీఆర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. వైద్యారోగ్యశాఖలో 10,048,ఉన్నత విద్యాశాఖలో 3,825,బీసీ వెల్ఫేర్‌లో 3,538,ఎస్సీ వెల్ఫేర్‌లో 1967,రెవెన్యూ విభాగంలో 1700 పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా సమాచార శాఖలో కేవలం 4 పోస్టులు భర్తీ చేయనున్నారు. నిజానికి ప్రభుత్వ శాఖల్లో 1.91లక్షల ఖాళీలు ఉండగా కేవలం 50వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఖాళీలన్నింటికీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 50వేల ఉద్యోగాలకు సైతం తీవ్ర స్థాయిలో జాప్యం జరుగుతుండటంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి,అసహనం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మళ్లీ ఎన్నికల కోసమే ఉద్యోగాల భర్తీని తెర పైకి తీసుకొచ్చిందా అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రత్యక్షంగా 70వేల మందికి,పరోక్షంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.25వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయాలనకుంటోంది. ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వర్గాల నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వమే షెడ్లు నిర్మించి ఇవ్వనుంది. ఔత్సాహికులు,ఆసక్తిగల వ్యాపారవేత్తలు ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు జులై 31 వరకు గడువు పొడగించే యోచనలో ఉంది.