అన్నింటినీ ఎదుర్కొంటాం, మరింత మేలు చేస్తాం – సీఎం జగన్
అన్ని వేళలా ప్రజల మన్ననలను పొందాం
సీఎంను దించేయాలనేది వారి ఆలోచనలు
మంచి చేద్దామంటే కోర్టులతో అడ్డుకుంటున్నారు
ఏది ఏమైనా ముందుకే వెళ్తాం
అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు..ప్రతిపక్షాలు- ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రయత్నాలు అంటూ ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల పైన సీఎం జగన్ స్పందించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తమను ఏ విధంగా ఆదరించారో సీఎం వివరించారు. 81 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతు దారులను ఎన్నుకున్నారని గుర్తు చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో 75 కి 74 గెలిచామని.. కార్పోరేషన్లలో 14 కి 14 గెలిచామని సీఎం జగన్ వివరించారు. ఇక, తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే రకంగా ప్రజల మద్దతు లభించిందన్నారు. తాజా ఫలితాల్లో 98 శాతం సీట్లు వైసీపీకి ప్రజలకు అందించారంటూ ధన్యవాదాలు చెప్పారు. ఏ ఎన్నిక జరిగినా..సడలని ఆప్యాయత..అభిమానంతో ప్రజలు ఆదరిస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. రెండున్నారేళ్ల పాలనలో తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం మేర పూర్తి చేసామని.. ప్రజల మన్ననలను అందుకున్నామని చెప్పారు. ప్రజలకు తాను రుణపడి ఉంటానని స్పష్టం చేసారు.
కరోనా వంటి పరిస్థితులను ఒక వైపు ఎదుర్కొంటుంటే మరో వైపు ప్రతిపక్షాలు..ఒక వర్గం మీడియా తమ ప్రభుత్వానికి ఇబ్బందులు.. అవరోధాలు కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్ల మనిషి సీఎం స్థానంలో లేడు కాబట్టి.. వేగంగా సీఎంను దించేయాలని దుర్మార్గ బుద్దితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. స్థానిక సంస్థల ఫలితాల్లోనూ టీడీపీ ఓడిపోయిందనే విషయాన్ని..నిజాన్ని కూడా టీడీపీ మద్దతు మీడియా స్వీకరించలేకపోతోందని కామెంట్ చేసారు. ప్రజలకు ఏ మంచి పని చేద్దామని ముందుకొచ్చినా… కోర్టుల్లో కేసులు వేయటం..అడ్డుకొనే ప్రయత్నాలు చేయటం రెండున్నారేళ్లుగా కొనసాగిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి అన్యాయ పరిస్థితుల్లోనూ ప్రజల మద్దతు..దేవుడి ఆశీస్సులతో చల్లగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఏడాదిన్నార క్రితం ఎన్నికలు మొదలయ్యాయని.. ఎన్నికల్లో ఎదుర్కొన లేక కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చారని సీఎం జగన్ ప్రతిపక్షాల పైన ఫైర్ అయ్యారు. ఎన్నికలు పూర్తయితే, చివరకు కౌంటింగ్ సైతం వాయిదా వేయించారని చెప్పుకొచ్చారు.ఏడాదిన్నార క్రితమే ఎన్నికలు జరిగి వీరంతా బాధ్యతలు తీసుకొని ఉంటే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లొ ప్రజలకు తోడుగా నిలబడే వారని పేర్కొన్నారు. ఇలా ప్రతీ ఎన్నికలోనూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ.. ఇంత మంచి మద్దతు ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సీఎం చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలు తమ పైన బాధ్యతను మరింత పెంచాయని.. ఇంకా కష్ట పడతాం… మంచి చేసే ప్రయత్నం చేస్తానంటూ సీఎం జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఎదుర్కొంటూ ప్రజలకు మంచి చేసేందుకే తాము ముందుకు వెళ్తామని సీఎం జగన్ స్పష్టం చేసారు.