యువతకు వైఎస్ జగన్ పెద్ద పీట
🔹నియోజకవర్గానికి ఒకటి నైపుణ్యాభివృద్ధి కళాశాల ఏర్పాటు
అమరావతి (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం శుభవార్త వినిపించింది. యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన తక్షణ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌లను రూపొందించాలని సంబంధిత శాఖను ఆదేశించింది.దీనికి అవసరమైన పాలనాపరమైన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది కూడా. దీనికి సంబంధించిన పనులను నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌కు అప్పగించింది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జీ జయలక్ష్మి దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ ఏర్పాటు కానుంది.
దీనితోపాటు అన్ని రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్‌ను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది. ఒక్కో నైపుణ్యాభివృద్ధి కళాశాలలో ఆరు తరగతి గదులు, రెండు ల్యాబొరేటరీలు, ఒక వర్క్‌షాప్ ఉంటాయి. ఒకేసారి 240 మందికి శిక్షణ ఇచ్చేలా వాటిని తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. ఇందులో 120 మందికి రెసిడెన్షియల్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. నాన్ రెసిడెన్షియల్ కింద మరో 120 మంది విద్యార్థులు శిక్షణ పొందే వీలు ఉంది. ఒక్కో స్కిల్ కాలేజీకి ప్రభుత్వం 20 కోట్ల రూపాయల గ్యాపెక్స్ ఫండ్‌ను సమకూర్చుతుంది. అలాగే- దేశవ్యాప్తంగా పేరున్న పరిశ్రమలు, పారిశ్రామిక అసోసియేషన్లతో లింకప్ అయ్యే ఏర్పాటు చేస్తుంది. ఫలితంగా- ఆయా పరిశ్రమలు, అసోసియేషన్ల ప్రతినిధులు యువతకు ప్రాక్టికల్స్‌లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌషల్ యోజన, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన పథకాలతో ఈ కాలేజీలను అనుసంధానం చేస్తుంది.