sharmila

 

తండ్రిబాటలో తనయ

 

🔹కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే నా పాదయాత్ర
🔹కేసీఆర్‌కు వైఎస్ షర్మిల సవాల్
🔹ఓటుకు నోటు దొంగ అంటూ రేవంత్‌పై ఫైర్

 

చేవెళ్ల (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, సమస్యలు లేవని నిరూపిస్తే తన ముక్కు నేలకు రాస్తానంటూ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బుధవారం వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర చేవెళ్ల నుంచడి ప్రారంభమైంది. వైఎస్‌ విజయమ్మ షర్మిల చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించారు. వైయస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే చేవెళ్ల నుంచి 18 ఏళ్ల క్రితం వైఎస్సార్‌ తొలి అడుగు పడిందని ఆమె గుర్తుచేశారు. తెలంగాణలోని ప్రతి పల్లెకు వస్తానని.. వారితో మమేకం అవుతానని షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్యమన్నారు.ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్.. కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టారని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని బయట పెడతానని.. కేసీఆర్‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతానంటూ షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని.. కళ్లముందు 1.90 లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు లేవంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులు హమాలీలుగా మారారని.. ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలు పీకేశారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. బీసీలకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. నిజంగా తెలంగాణలో సమస్యలు లేకుంటే తన ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానని.. సమస్యలుంటే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి అంటూ కేసీఆర్‌కు షర్మిల సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, ఆయనలా బ్లాక్ మెయిల్ చేయడం తమకు రాదని విమర్శించారు. ప్రజాప్రతినిధుల కొనుగోలు అమ్మకాలు తమకు చేతకాదన్నారు. ఓటుకు నోటు కేసులో సీఎం కేసీఆర్ చేతులో రేవంత్ పిలకలా అయ్యారని విమర్శించారు. అడ్డంగా దొరికిన దొంగకు విశ్వసనీయత ఉంటుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని బీజేపీ అంటోందని.. అయితే ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాలుకకు నరం లేదని విమర్శించారు. గాడిదను కూడా ఆవు అని నమ్మించగలరని చురకలంటించారు. కాగా, బహిరంగ సభ అనంతరం షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పర్యటించనున్నారు. అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకోనున్నారు. తమ పాదయాత్ర నిరంతరాయంగా సాగుతుందని, బ్రేకులు లేవని ఇప్పటికే షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా చేవెళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పుడు తన తండ్రి స్ఫూర్తితోనే వైఎస్ షర్మిల పాదయాత్రను ప్రారంభించారు.