రాజద్రోహం చట్టంపై సమీక్షకు – సుప్రీం రెడీ
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు తమకు నచ్చని వారిపై నమోదు చేస్తున్న రాజద్రోహం కేసులు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ఇందులో పిటిషనర్ లేవనెత్తిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో రాజద్రోహం కేసు బాధితులుగా ఉన్న రఘురామరాజు, జడ్డి రామకృష్ణ వంటి వారికి సుప్రీంకోర్టు సమీక్ష ఊరటనిస్తోంది. ఓంబాట్కరే అనే రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఐపీసీలోని రాజద్రోహం సెక్షన్ 124ఏ రాజ్యాంగ విరుద్ధమైందంటూ, దాన్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని రక్షణం రద్దు చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. దీంతో ఈ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్ధానం విచారణకు స్వీకరించింది. దేశంలో రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛపై నీళ్లు చల్లేలా ఉందని పిటిషనర్ అపెక్స్ కోర్టు దృష్టికి తెచ్చారు. జస్టిస్ ఎన్వీ రమణ, ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్ తో కూడిన సుప్రీం ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. మాజీ ఆర్మీ అధికారి అయిన పిటిషనర్… ‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిపై రాజ్యాంగ విరుద్ధంగా అస్పష్టమైన నిర్వచనాల ఆధారంగా రాజద్రోహం సెక్షన్ ను చట్టబద్ధం చేయడం, ఆర్టికల్ 19 (1) (ఎ) కింద పౌరులకు ఉన్న స్వేచ్ఛా భావ వ్యక్తీకరణకు ప్రాథమిక హక్కును హరిస్తోందని ఆరోపించారు. కాలానుగుణంగా ఈ చట్టంలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో మణిపూర్, ఛత్తీస్ గఢ్‌లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు కిషోర్‌చంద్ర వాంగ్‌చెమ్చా మరియు కన్హయ్య లాల్ శుక్లా దేశద్రోహ చట్టం యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సవాలు చేస్తూ చేసిన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరో ధర్మాసనం కేంద్రం స్పందన కోరింది. ఇది పెండింగ్ లో ఉండగానే మరో బెంచ్ లో పిటిషన్ రావడం, దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించడం చర్చనీయాంశమవుతోంది.