టెలికాం సంస్కరణలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
100 శాతం ఎఫ్డీఐ
స్ప్రెక్ట్రమ్ ఛార్జీల మారటోరియం
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కేంద్ర ప్రభుత్వం బుధవారం మరిన్ని టెలికాం రంగ సంస్కరణలకు పచ్చజెండా ఊపింది. ఇందులో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపడంతో పాటు టెలికాం సంస్ధలకు నాలుగేళ్ల పాటు స్ప్కెక్ట్రమ్ ఛార్జీల బకాయిల చెల్లింపుపై మారటోరియడం విధించడం వంటి చర్యలు ఉన్నాయి. దీంతో టెలికాం సంస్ధలకు భారీగా ఊరట లభించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో టెలికాం రంగానికి సంబంధించి 9 నిర్మాణాత్మక సంస్కరణలు, 5 ప్రక్రియ సంస్కరణలను ఆమోదించారు.. టెలికాం రంగం కోసం తీసుకున్న నిర్ణయాలలో, అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి హేతుబద్ధం చేయబడిన స్పెక్ట్రం యూజర్ ఛార్జ్. స్పెక్ట్రం వినియోగ ఛార్జీల్ని హేతుబద్ధం చేస్తూ కేంద్రం ఇవాళ నిర్ణయం తీసుకుంది. వార్షిక వినియోగం ఆధారంగానే స్పెక్ట్రమ్ ఛార్జీల్ని టెలికాం సంస్ధలపై విధించబోతున్నారు. అలాగే ఈ స్పెక్ట్రమ్ ను ఇతర సంస్ధలతో పంచుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్న టెలికాం రంగానికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.
మరోవైపు ఏజిఆర్ హేతుబద్ధీకరణ, భవిష్యత్ స్పెక్ట్రమ్ వేలంలో స్పెక్ట్రమ్ కోసం సేకరించిన స్పెక్ట్రం వినియోగ ఛార్జీని మినహాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాక, లైసెన్స్ ఫీజు, ఇతర సారూప్య లెవీలకు వ్యతిరేకంగా బిజి అవసరాలను భారీగా తగ్గించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భవిష్యత్ వేలం కోసం, స్పెక్ట్రమ్ గడువును 20 నుండి 30 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్ వేలంలో పొందిన స్పెక్ట్రం కోసం 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రం తిరిగి అప్పగించడానికి అనుమతించనున్నారు. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం, భారతదేశంలో టెలికాం కంపెనీల రుణాలు సుంకాలు పెంచినప్పటికీ మార్చి 2022 నాటికి వారి రుణ స్థాయిలు రూ. 4.7 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (VI) వంటి కొన్ని టెలికాం సంస్థలు పెండింగ్‌లో ఉన్న ఏజిఆర్ బకాయిలలో భాగంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టాటా టెలీ సర్వీసెస్‌తో పాటు రెండు ప్రధాన టెల్కోలు 10 విడతలుగా మార్చి 31, 2031 లోగా తమ బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం, టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా మొత్తం బకాయి రూ .1.92 ట్రిలియన్లుగా ఉంది. ఇందులో ఏజిఆర్ బకాయిగా ప్రభుత్వానికి 58,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన మొత్తంలో స్పెక్ట్రం సంబంధిత బకాయిలు, బ్యాంక్ రుణాలు ఉన్నాయి. జూలైలో, సుప్రీంకోర్టు టెలికాం శాఖ డిమాండ్ చేసిన దానికంటే తక్కువగా ఉన్న స్వీయ-అంచనా ఏజిఆర్ బకాయిల చెల్లింపును అనుమతించాలన్న టెల్కో విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కానీ ఇప్పుడు కేంద్రం హేతుబద్ధీకరణ నిర్ణయంతో ఆయా సంస్ధలకు ఊరట దక్కనుంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న టెలికాం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ ఇవాళ తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ఉపయోగపడతాని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో పార్లమెంటుతో సంబంధం లేకుండా వందశాతం ప్రత్యక్ష పెట్టుబడులకు తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.