రామ్ నాథ్ కోవింద్ భోవోద్వేగం
🔹రాష్ట్రపతిగా తొలిసారి సొంతూరికి..
🔹నేలను తాకి మాతృభూమికి వందనం
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్ నాథ్ కోవింద్ తొలిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తన స్వగ్రామానికి వెళ్లారు. కాన్పూర్ దెహత్ జిల్లా పరౌంఖ్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ నుంచి దిగిన ఆయన ఉద్వేగానికి గురయ్యారు. కిందికి వంగి చేతులతో భూమిని తాకి.. ఆ చేతిని శిరస్సుకు తగలించుకుని తన మాతృభూమిపై ఉన్న ప్రేమను, భక్తిని చాటుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు రాష్ట్రపతికి పుట్టిన నేలపై ఉన్న ప్రేమను చూసి ప్రశంసిస్తున్నారు. కాగా, స్వగ్రామానికి చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలిప్యాడ్ వద్దకు వచ్చి సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్రపతి మాట్లాడారు. యూపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్న రామ్ నాథ్ కోవింద్.. అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. తాము టీకా తీసుకోవడంతోపాటు చుట్టుపక్కలవారిని కూడా వేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు.
గ్రామ ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు తాను ఎన్నటికీ మర్చిపోలేనని రాష్ట్రపతి కోవింద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా.. పుట్టిన గడ్డ మట్టి వాసన, గ్రామస్తుల ప్రేమాభిమానాలు తన వెంటే ఉంటాయన్నారు. పరౌంఖ్ తనకు కేవలం ఓ గ్రామం కాదని.. తనకు ఎన్నో విషయాలను నేర్పించి, దేశానికి సేవ చేయగలిగే స్థితికి తీసుకెళ్లిన మాతృభూమని అన్నారు. తనలాంటి అతి సామాన్య వ్యక్తి దేశంలోనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలడని కలలో కూడా అనుకోలేదని, కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ దీన్ని నిరూపించి చూపించిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కాగా, స్వగ్రామానికి బయల్దేరిన రాష్ట్రపతి దంపతులు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో కాన్పూర్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ్నుంచి హెలికాప్టర్‌లో స్వగ్రామం పరౌంఖ్ చేరుకున్నారు. రెండో రోజులపాటు ఇక్కడే పర్యటించి జూన్ 28న కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి లక్నోకు వెళ్లనున్నారు. అక్కడ మరో రెండు రోజులు పర్యటించి జూన్ 29న సాయంత్రం తిరిగి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు.