Huzurabad Elections

 

ఎత్తులకు పై ఎత్తులతో వేడేక్కిన హుజూరాబాద్ రాజకీయం

 

* మంత్రులు, శాసనసభ్యులంతా అక్కడే

* ఎత్తులకు పై ఎత్తులతో ప్రధాన పార్టీల ఎత్తుగడలు

* ఉప ఎన్నికలపై ఉత్సాహం చూపని కాంగ్రెస్

* ఇంటింటి ప్రచారాలు, సమావేశాలు, కులసంఘాల సమ్మేళనాల తో ప్రచార హోరు

 

హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రం లో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు కాక పుట్టిస్తు ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తలమునకలై గెలుపే ముఖ్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటు యద్దానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపద్యంలోనే అధికార పార్టీ మంత్రులను,  శాసన సభ్యులను, పార్టీ పెద్దలను  హుజూరాభాద్ కేంద్రంగా మోహరించి గెలుపుకోసం అహర్నిశలు కష్టపడుతుండగా, బిజెపి అభ్యర్థి ఈటల అయన భార్య జమున తన మద్దతు దారులతో  గ్రామం గ్రామాన ఇంటింటి ప్రచారం చేస్తు ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితులో ఆనివార్య మయ్యయో ప్రజలకు వివరిస్తు ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఉప ఎన్నికపై కొంత నిర్లిప్తంగా వ్యవహరిస్తుందని పార్టీలోని నాయకులు చర్చించు కుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆద్యక్షునిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక రేసులో ప్రధాన పోటీదారుగా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి.  రేవంత్ రెడ్డి దూకుడు గురించి తెలిసిన వారంతా ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికను కూడా సవాల్‌ గా తీసుకుని ముందుకు సాగుతారని అనుకున్నారు. ఇందులో భాగంగానే కొండా సురేఖను ఎన్నికల బరిలో నిలపాలని ఆయన చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకుని టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్దం చేస్తున్నారని భావించారు. కానీ కొండా సురేఖ హుజూరాబాద్ నుంచి పోటీ చేయడానికి నిరాకరించడం తో కాంగ్రెస్‌ లో పెద్దగా పేరు లేని బల్మూరి వెంకట్ అనే యువ నాయకుడి కి హుజూరాబాద్‌లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది.
అయితే కొండా సురేఖ బరి నుంచి తప్పుకోవడం తో రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక విషయంలో వ్యూహం మార్చారేమో అనే టాక్ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మిగతా పార్టీలకు గట్టిపోటీ ఇవ్వాలనుకుంటే బలమైన అభ్యర్థి బరిలో ఉండాల్సిందే అని రేవంత్ రెడ్డి మొదటి నుంచి భావించారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ క్రమం లోనే కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. అసలు కొండా సురేఖ పేరు తెరపైకి రావడం వెనుక కూడా అసలు కారణం రేవంత్ రెడ్డి అనే వాదన కూడా ఉంది. కానీ ఈ విషయంలో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ముందుగానే ఆయన హుజూరాబాద్ విషయంలో వ్యూహం మార్చారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నిక మీద ఫోకస్ చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదని, దీనికి తోడు ఫలితాలను బట్టి విపక్షాలకు అందులోనూ అధికార టీఆర్ఎస్‌కు మళ్లీ టార్గెట్ అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి టీమ్ భావిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ ఉప ఎన్నికను రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎలాగూ తనదైన మార్కును చూపిస్తారనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి హుజూరాబాద్‌ లో చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించలేదని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.