bandi

రాష్ట్రంలో నిరంకుశ పాలనా 

 

🔹ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా.?
🔹మృగశిర లోపు ధాన్యం కొనాలన్న సీఎం..
🔹ఎక్కడా ధాన్యం కొన్న దాఖలాలు లేవన్న సంజయ్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని, ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకి ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమవేశంలో ప్రభుత్వ విధానాల మీద మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. 18 ఏళ్ళు నిండిన భారత ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి సమావేశం ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలపై ఈ సమావేశం లో చర్చ జరిగింది. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలపై బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రం లో ప్రస్తుత అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు నిరంకుశ పాలనను వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కారులను అణిచివేయడమె లక్ష్యంగా పాలన సాగుతోందని, వాళ్ళ క్యాబినెట్ లో కీలక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ కే భద్రత లేని పరిస్థితులు సృష్టించారని, వాళ్లకు డబ్బా కొడితే మంచోళ్ళు లేకుంటే అవినీతి పరులన్న ముద్ర వేస్తున్నారని, జర్నలిస్టు రఘును పట్టపగలు దొంగల్లాగా పోలీసులే కిడ్నాప్ చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

టీఆరెస్ నాయకుల కబ్జాలను వెలికితీస్తే కిడ్నాప్ చేస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రం లో ఒక మంత్రి స్థాయి వ్యక్తికి, జర్నలిస్టులకు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని సంజయ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకి ఏకైక వేదిక బీజేపీ మాత్రమే అని సంజయ్ చెప్పారు. త్వరలో పార్టీలో జరగబోయే సమావేశంలో చేరికలపై కూడా చర్చ వచ్చిందని, మరికొంత మంది కీలక నాయకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.రాష్ట్రం లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పలువురు నాయకులు ప్రస్తావించారు. మృగశిర ప్రారంభ మైనా ఇంకా చాలా చోట్లా ధాన్యం కల్లాల్లో ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని సంజయ్ అన్నారు. మరోవైపు విత్తనాల కోసం రైతులు రోజులతరబడి క్యూ కట్టాల్సి వస్తోందని, దుక్కులు దున్ని, విత్తనాలు వేసేందుకు సిద్ధం కావాల్సిన రైతులు ధాన్యం కల్లాల్లో, విత్తనాల కేంద్రం ముందు పడిగాపులు కాయాల్సి రావడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు.కేంద్రం ఉచితంగా ప్రకటించిన వ్యాక్సినేషన్ ను సమర్థవంతంగా నిర్వర్తించే వైద్య ప్రక్రియ రాష్ట్రం వద్ద లేవని సంజయ్ అన్నారు. వెంటనే అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని, ప్రతి నెల కేంద్రం నుంచి వచ్చే 20 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులకు కోల్డ్ చైన్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రధాని ప్రకటించిన ఉచిత వ్యాక్సిన్ సకాలంలో ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని సంజయ్ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.