Jagaaan

 

వైద్య సౌకర్యాల్లో లోటుపాట్లు ఉండకూడదు – సీఎం జగన్

 

🔹కొవిడ్ పై అధికారులకు సీఎం జగన్ ఆదేశం

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ నివారణ, ప్రజలకు అందించే వైద్య సౌకర్యాల్లో లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కొవిడ్ నియంత్రణ, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల కంటే దిగువకు వచ్చిందని.. పాజిటివిటీ రేటు కూడా 5.23శాతానికి దిగివచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలలో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని.. రాష్ట్రంలో జాతీయ సగటు కంటే అధికంగా రికవరీ రేటు ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59శాతం, ఏపీలో 96.67శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. 104కు కూడా కాల్స్ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,148 బ్లాక్ ఫంగస్ కేసులండగా.. వీరిలో 1,095 మందికి సర్జరీలు జరిగాయని… 237 మంది మృతి చెందగా… 1,398 మంది డిశ్చార్జ్ అయ్యారని మిగిలిన వారికి చికిత్స జరుగుతుందని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 134 ఆక్సిజన్‌ జనరేషన్‌(పీఎస్‌ఎ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు…, 50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబరు నాటికి 97 ప్లాంట్లు ఏర్పాటవుతాయని.., మిగిలిన 37 ప్లాంట్లు రానున్న మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో వినియోగించే మందులన్నీ జీఎంపీ మరియు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాలని అధికారులకు స్పష్టంచేశారు.  అలాగే ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోకూడా జీఎంపీ మరియు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని.. దీనిపై నిరంతరం మానిటరింగ్‌ ఉండాలన్నారు. అలాగే ఆస్పత్రి భవనాల నిర్వహణ, వైద్య పరికరాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని.., దీనిపై ప్రత్యేక ఎస్‌ఓపీలను తయారు  చేయాలని  అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రోగులకు ఆహారంపై పర్యవేక్షణ అవసరమన్న సీఎం… అలాగే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ ఉండాలని.. దీని కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.ఆస్పత్రుల్లో నాడు–నేడు

ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణకు చాలా ప్రాధాన్యత నివ్వాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. 21 రోజులలో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హెల్త్‌ హబ్స్‌

జిల్లాల్లో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. ఏయే చికిత్సలకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నదానిపై వివరణ ఇచ్చారు. క్యాన్సర్, గుండెజబ్బులు, చిన్నపిల్లల సర్జరీలకోసం అధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వ్యాధులకు వైద్యసేవలు ఇక్కడ హబ్స్‌లో అందేలా.. ఆ రకమైన స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చే దిశగా చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న 16 మెడికల్‌కాలేజీలు, ఆధునీకరిస్తున్న 11 పాత వైద్య కళాశాలలు, ఈ హెల్త్‌హబ్స్‌తో ఆరోగ్యరంగం బలోపేతం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. హెల్త్‌హబ్స్‌కు స్థలాలు.. ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ హాజరయ్యారు.