jagan

 

సొంతగడ్డపై వెనక్కి తగ్గిన జగన్

 

🔹బీజేపీ మరో అస్త్రం-లాగేసుకున్న వైనం
🔹బీజేపీ ప్లాన్ సక్సెస్ ?
🔹జగన్ నిర్ణయం వ్యూహాత్మకమేనా ?

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మతపరమైన అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న బీజేపీ తాజాగా మరో రెండు అస్త్రాలకు పదునుపెట్టింది. అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యే అందించిన అస్త్రాన్ని వాడుకుంటూ అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అదీ వైఎస్ జగన్ సొంతగడ్డ కడప జిల్లాలోనే. దీంతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా ఉంది. అదే సమయంలో కాషాయ పార్టీ విషయంలో జగన్ వైఖరిని కూడా తేటతెల్లం చేసింది. రెండేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి సహజంగా ఉన్న ఓటు బ్యాంకు బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ బీజేపీ రెచ్చిపోతోంది. ప్రజా సమస్యలతో పోలిస్తే మతపరమైన అంశాల్లో వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న కాషాయ నేతలు విగ్రహాల రాజకీయాన్ని నమ్ముకుంటున్నారు. గతేడాది ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం పేరుతో వైసీపీని టార్గెట్ చేసిన బీజేపీ.. తాజాగా కడప జిల్లాలో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు, గోవధ చట్టంపై వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వాడుకుంటూ బీజేపీ చేస్తున్న విమర్శలు వైసీపీ సర్కార్ ను ఇరుకునపెడుతున్నాయి. అయితే గతేడాది ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై బీజేపీ రాజకీయాన్ని తనదైన శైలిలో చెక్ పెట్టిన జగన్ ఈసారి కూడా తన నిర్ణయంతో అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది.

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్ధానిక మున్సిపాలిటీలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు శంఖుస్ధాపన కూడా చేశారు. దీంతో వివాదం మొదలైంది. టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్నాటకలో టార్గెట్ చేస్తున్న బీజేపీ.. ప్రొద్దుటూరులోనూ అదే రాజకీయాన్ని రిపీట్ చేయాలని నిర్ణయించింది. వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ నేతలు ఛలో ప్రొద్దుటూరు పేరుతో నిరసనలకు దిగారు. బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు అయితే ఏకంగా విగ్రహం ఏర్పాటు చేస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును బీజేపీ తన మైలేజ్ కోసం వాడుకోవడం సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. బీజేపీ నేతలు ప్రొద్దుటూరులో చేస్తున్న వరుస పర్యటనలకు అరెస్టులతో అడ్డుకట్ట వేయడం దీర్ఘకాలం సాధ్యమయ్యే అవకాశం లేదు. దీంతో ఈ వివాదాన్ని ఇలాగే వదిలేస్తే కాషాయల నేతలు ఇతర జిల్లాలకూ దీన్ని విస్తరించే ప్రమాదం ఉండనే ఉంది. దీంతో ఆందోళనలో ఉన్న వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. ఈ మేరకు గతంలో మున్సిపాలిటీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనవసర వివాదాలకు తావివ్వకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా వెల్లడించారు.

ఎక్కడో కర్నాటకలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు తాము వాడుకుంటున్న టిప్పుసుల్తాన్ అంశాన్ని స్వయంగా అధికార వైసీపీ ఎమ్మెల్యే తెరపైకి తీసుకురావడంతో ఆ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంది. సాధ్యమైనంతగా వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టిన బీజేపీ నేతలు ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఛలో ప్రొద్దుటూరు పేరుతో బీజేపీ చేసిన హంగామాను అరెస్టులతో అడ్డుకున్న వైసీపీ సర్కార్.. ఆ తర్వాత విగ్రహం ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో కాషాయ నేతల ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇదే ఊపులో మిగతా అంశాలపైనా పోరాటానికి బీజేపీ సిద్ధమవుతోంది. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలను భగ్నం చేస్తూ, బిజెపి ఆంధ్రప్రదేశ్ చేసిన పోరాటాల ఫలితంగా, అక్కడ ఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు దేశంలో నివసించే ఎవరైనా, భారత రాజ్యాంగాన్ని పాటించాలని,, కాదని రాచమల్లు రాజ్యాంగం, పాటిస్తామంటే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎమ్మెల్యే మీద మరియు ఇతర నిర్వాహకుల మీద తక్షణం పోలీసులు కేసు నమోదు చేయాలని ఏపి బీజేపీ డిమాండ్ చేస్తోందని విష్ణు తెలిపారు. సొంతగడ్డపై టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కర్నాటకలోనూ టిప్పు సుల్తాన్ జయంతిపై అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని బీజేపీ ఓ రేంజ్ లో టార్గెట్ చేయడం ద్వారా భారీ మైలేజ్ సాధించింది. చివరికి దక్షిణాదిలో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కూడా కర్నాటకలోనే సాధ్యమైంది. ఇప్పుడు అదే టిప్పుసుల్తాన్ విషయంలో ప్రొద్దుటూరులో చూసీ చూడనట్లుగా వదిలేస్తే ఇది భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా కలిసి వస్తుందని, అప్పుడు మిగతా అంశాలతో పాటు దీన్ని కూడా తాము ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకే టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ సర్కార్ కు మరో తలనొప్పి తప్పినట్లయింది.