KTR & Malabar

 

తెలంగాణలో మలబార్ గోల్డ్ సంస్థ భారీ పెట్టుబడి

 

🔹కేటీఆర్‌తో భేటీ
🔹2500మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ దేశీయ జ్యువెలరీ సంస్థ మలబార్ గ్రూప్ రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడితో జ్యువెలరీ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ మేరకు మలబార్ గ్రూప్ అధినేత అహ్మద్‌తో పాటు సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ నిర్ణయాన్ని వెల్లడించారు.మంత్రి కేటీఆర్ మలబార్ సంస్థ నిర్ణయాన్ని స్వాగతించి అభినందనలు తెలిపారు. జ్యువెలరీ వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఉండటం,కంపెనీ నిర్వహణకు అవసరమైన నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో తెలంగాణలో పెట్టుబడికి ముందుకొచ్చినట్లు మలబార్ సంస్థ అధినేత అహ్మద్ కేటీఆర్‌తో తెలిపారు. తెలంగాణలో గోల్డ్,డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ,గోల్డ్ రీఫైనరీ యూనిట్లను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తమ సంస్థకు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని… తెలంగాణ నెలకొల్పే యూనిట్లతో సంస్థ ఉత్పాదకత మరింత బలోపేతమవుతుందని అన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 2500 మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు.

మలబార్ సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… జ్యువెలరీ తయారీ రంగంలో తెలంగాణలో అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న స్వర్ణకారులు ఉన్నారని చెప్పారు. మలబార్ సంస్థ ఇచ్చే ఉద్యోగాల్లో వీరిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.మలబార్ గ్రూపుకు ప్రభుత్వం తరుపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్‌, ఇతర విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి భారీగా పెట్టబడులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే నాలుగు అతి పెద్ద టెక్‌ కంపెనీల అతిపెద్ద క్యాంపస్‌లు అమెరికా వెలుపల హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇటీవలే అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్ సైతం తమ కొత్త క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.హైటెక్‌ సిటీలోని సలార్‌పురియా సత్వ నాలెడ్జ్ సిటీలో 8,22,000 చదరపు అడుగుల ఏరియాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన అతిపెద్ద క్యాంపస్ ఇదే కావడం విశేషం.

🔹ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరుతో పోటాపోటీగా హైదరాబాద్:

ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ మహానగరం బెంగళూరుతో పోటాపోటీగా దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో దక్షిణాది నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లోనే 66 శాతం డిమాండ్ నెలకొందని రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా కంపెనీలు 2.13 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకోగా అందులో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలలోనే 1.4 కోట్ల చదరపు అడుగులు( 66 శాతం) స్థలం ఉందన్నారు. అలాగే ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌, పుణేలలో కలిపి 45.6 లక్షల చదరపు అడుగులు (21 శాతం), దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలో 23 లక్షల చదరపు అడుగులు (11 శాతం) ఆఫీస్ స్పేస్ స్థలాన్ని కంపెనీలు అద్దెకు తీసుకున్నాయి.అటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ కరోనా ప్రభావాన్ని అధిగమించి హైదరాబాద్ దూసుకెళ్తోంది.రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అధ్యయన సంస్థ ఆనరాక్‌ విడుదల చేసి రెండో త్రైమాసిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.