KCR

 

హుజురాబాద్‌లో దళిత బంధుకు మరో రూ.500 కోట్లు

 

🔹మొత్తం రూ.2వేల కోట్లు విడుదల

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్న దళిత బంధు పథకం కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్పోరేషన్ నుంచి కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు నిధుల బదిలీ జరిగింది. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం రూ.2వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లయింది.ఈ నిధులతో నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హుజురాబాద్‌లో దళిత బంధు అమలుకు రూ.2వేల కోట్లు విడుదల చేస్తామని పథకం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే స్వల్ప వ్యవధిలోనే మొత్తం నిధులను విడుదల చేశారు. రానున్న రోజుల్లో బీసీ,ఎస్టీ,ఓసీల్లోని పేదలకు సైతం కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. దళిత బంధు ప్రకటన తర్వాత ఇతర వర్గాల్లో నుంచి కూడా డిమాండ్ వెల్లువెత్తడంతో ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

హుజురాబాద్‌లో సంపూర్ణంగా… మిగతా 118 నియోజకవర్గాల్లో పాక్షికంగా దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలుచేయనుంది. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మందికి రూ.10లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హుజురాబాద్‌ నుంచి దీనికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం… అక్కడ ప్రతీ దళిత కుటుంబానికి పథకాన్ని అందిస్తామని చెబుతోంది. ఆగస్టు 16న హుజురాబాద్ నియోజకవర్గంలోని 15 దళిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెక్కులు అందజేశారు. దళిత బంధు పూర్తిగా సబ్సిడీ పథకమేనని… తిరిగి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు దళిత బంధు పథకం ఓట్ల బంధు పథకమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. నిజంగానే కేసీఆర్‌కు దళితుల పట్ల అంత ప్రేమ,వారికి మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే… ఉపఎన్నికకు ముందే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీన్ని అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్… వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. దళిత బంధు పథకం కూడా ఆరంభ శూరత్వమే తప్ప… చివరి వరకు కొనసాగదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం… ఆరు నూరైనా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామని అంటున్నారు. తెలంగాణ దళితులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా వారిని ఆర్థికంగా నిలబెడుతామని అంటున్నారు. నిజానికి ఏడాది కింద ప్రారంభం కావాల్సిన ఈ పథకం… కరోనా వల్ల ఆలస్యమైందని చెబుతున్నారు.అయితే ఇంతవరకూ ఈ పథకానికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి సాధ్యం కాని పథకాలను తెర మీదకు తెస్తున్నాడని విమర్శిస్తున్నాయి.తెలంగాణలో దళితుల జనాభా దాదాపు 80లక్షల వరకు ఉంటుందనేది అంచనా. రాష్ట్రంలో వారిదే అత్యధిక జనాభా అని ఇటీవలి సభలో కేసీఆర్ పేర్కొన్నారు. దాదాపు 25లక్షల దళిత కుటుంబాలు ఉంటాయనే అంచనా ఉంది. ఈ లెక్కన దళితుల ఓట్లు గంప గుత్తగా పొందగలిగితే 2023లోనూ మరోసారి అధికారం తమదేనని భావనలో కేసీఆర్ ఉన్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.