టీడీపీ టు టీఆర్ఎస్ వయ బీజేపీ
టీఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి
ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిక
దళితబంధు విమర్శల పై స్పందించిన సీఎం..
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలలో చేరారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో.. మోత్కుపల్లి మెడలో గులాబీ కండువా వేసి ఆయనను సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్. దళిత బంధు పథకంపై విమర్శలు చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్‌లో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో మోత్కుపల్లి నర్సింహులు చాలా సీనియర్. తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇదివరకు ఆలేరు, ఆ తరువాత తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆరుసార్లు గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి బద్ధ వ్యతిరేకిగా మారారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. అక్కడ ఎంతోకాలం కొనసాగలేకపోయారు.తాజాగా టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్‌తో మోత్కుపల్లికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదివరకు కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన విషయం తెలిసిందే. మోత్కుపల్లి చేరిక సందర్భంగా కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మోత్కుపల్లికి రాష్ట్ర రాజకీయాల్ల ఎంతో అనుభవం ఉందని, ఆయన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ పరంగా కూడా మోత్కుపల్లి సేవలను టీఆర్ఎస్ వినియోగించుకోవడానికి అవకాశాలు లేకపోలేదు.
కేసీఆర్.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలను సంధిస్తోన్న విషయం తెలిసింది. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంటూ కాంగ్రెస్, భారతీయ జనత పార్టీ డిమాండ్ చేస్తోన్నాయి. ఇదే విషయం మీద ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో బహిరంగ సభ సైతం నిర్వహించారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పలుమార్లు కేసీఆర్‌కు లేఖలు రాశారు.ఈ పరిస్థితుల మధ్య దళిత సామాజిక వర్గానికే చెందిన, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి చేర్చుకోవడంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. దళిత బంధు పథకం అమలు పర్యవేక్షణ బాధ్యతలు, దీనికి సంబంధించిన ఛైర్మన్ పదవిని ఆయనకు కేటాయించే అవకాశం ఉందంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. శాసన మండలికి కూడా ఆయనను నామినేట్ చేస్తారని సమాచారం. శాసన మండలికి నామినేట్ చేస్తామనే హామీతోనే మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. దళితబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, రాజకీయాలకు అతీతంగా దీన్ని అమలు చేస్తున్నామని అన్నారు. అట్టడుగున ఉన్న వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఈ పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. రాజకీయాల కోసమో.. చిల్లర, మల్లర పనుల కోసమో దళితబంధు పథకాన్ని అమలు చేయట్లేదని అన్నారు. గ్రామ, మండల, పట్టణ, నగర స్థాయిలో దళితబంధు కమిటీలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారు. దళిత బంధు బ్రిగేడ్‌ను తయారు చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద 10 లక్షల రూపాయలను తీసుకుని దుర్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో.. నిఘా ఉంచుతామని కేసీఆర్ అన్నారు. మోత్కుపల్లి నర్సింహులు, తన ఆలోచనలు ఒకేరకంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. సమాజం, పేదల అభ్యున్నతి గురించి మోత్కుపల్లి ఆలోచిస్తుంటారని, ఆయన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొస్తామని అన్నారు.