ktr

 

హైదరాబాద్‌లో కొత్తగా 17 ఎస్టీపీలు

 

🔹రూ.1280 కోట్లతో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
🔹ప్రస్తుతం 770ఎంఎల్‌డీల మురికినీటి శుద్ధి
🔹కొత్త వాటితో 60శాతానికి పెరగనున్న సీవరేజ్ ట్రీట్‌మెంట్
🔹దశల వారీగా మిగతా ఎస్టీపీలు..

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హైదరాబాద్‌లో రూ.రూ. 1280 కోట్ల‌తో 17 ఎస్టీపీ(సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌)లు నిర్మించ‌బోతున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీ(మిలియన్స్ అఫ్ లీటర్స్ పర్ డే) మురుగునీరు శుద్ధి చేయబడుతుందని చెప్పారు.హైదరాబాద్‌లో రోజుకు 1950 ఎంఎల్‌డీల మురికి నీరు ఉత్పత్తి అవుతోందన్నారు. దేశంలో 8 మహానగరాలు ఉండగా… ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో మాత్రమే దాదాపు 40శాతం మురికినీటి శుద్ది జరుగుతోందన్నారు. అయితే ఇది సరిపోదని.. అందుకే మరో 17 ఎస్టీపీలను నిర్మించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఫ‌తేన‌గ‌ర్‌లో సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం(అగస్టు 6) శంకుస్థాప‌న చేశారు. రూ. 317 కోట్ల‌తో 100 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.హైద‌రాబాద్‌ నగరానికి ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో భారీగా ఉపాధి క‌ల్ప‌న,ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అందుకే ప్ర‌తీ ఏటా ల‌క్ష‌ల మంది హైద‌రాబాద్‌కు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఏటా కొత్తగా వస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో… న‌గ‌ర‌నానికి న‌లు వైపులా కొత్త కాల‌నీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లు విస్తరిస్తున్నాయని అన్నారు. ప్ర‌తి రోజు హైద‌రాబాద్‌లో 1,950 ఎంఎల్‌డీల మురికి నీరు ఉత్ప‌త్తి అవుతోందన్నారు. ఇందులో దాదాపు 90-94 శాతం మురికి నీరు గ్రావిటీ ద్వారా మూసీ న‌దిలోకి… అక్కడి నుంచి కృష్ణా న‌దిలో చేరి, ఆ త‌ర్వాత స‌ముద్రంలో క‌లుస్తుందన్నారు. ఆ మురికి నీటిని శుద్ది చేసేందుకు సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

గ‌తంలో భోల‌క్‌పూర్‌లో మంచి నీటి పైపుల్లోకి మురికి నీరు చేరడం వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.కాబట్టి మురికినీటి శుద్ధి అనేది అత్యంత ప్రాధాన్యం క‌లిగిన అంశం అని అన్నారు. భార‌త‌దేశంలో 8 మ‌హాన‌గ‌రాలు ఉండగా… వీట‌న్నింటిలో ఎక్క‌డా లేని విధంగా హైద‌రాబాద్‌లో దాదాపు 40 శాతం(772 ఎంఎల్‌డీల‌) మురికి నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నామన్నారు. కానీ పూర్తి స్థాయిలో దీన్ని చేపట్టాల్సి ఉందని… అది జరగకపోతే హైదరాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా రూపొందించుకోలేమని అన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో 17 ఎస్టీపీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.1,280 కోట్ల‌తో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్స్‌లో 17 ఎస్టీపీలు క‌ట్ట‌బోతున్నట్లు తెలిపారు. వీటి స్థాపిత సామ‌ర్థ్యం 376.5 ఎంఎల్‌డీలు అని పేర్కొన్నారు. వీటి ద్వారా నగరంలో మురికి నీటి శుద్ది 55 నుంచి 60 శాతానికి పెరుగుతుందన్నారు. మ‌రో 40 శాతం మురికినీటి శుద్ది కోసం భవిష్యత్తులో మరిన్ని ప్లాంట్లు నిర్మిస్తామన్నారు. కూక‌ట్‌ప‌ల్లి పరిధిలోని ప్ర‌గ‌తి న‌గ‌ర్‌-అంబీర్ చెరువు, చిన్న మైస‌మ్మ చెరువు, న‌ల్ల చెరువు, ఖాజాకుంట, ఎల్ల‌మ్మ‌కుంట చెరువు, ఫ‌తేన‌గ‌ర్‌ నాలాపై ఎస్టీపీలు నిర్మిస్తామన్నారు. అలాగే కుత్బుల్లాపూర్ పరిధిలోని వెన్న‌ల‌గ‌డ్డ‌, చింత‌ల్ డివిజ‌న్‌లోని గాయ‌త్రీన‌గ‌ర్, ఫాక్స్ సాగ‌ర్ చెరువు, శివాల‌య న‌గ‌ర్ చెరువు, ప‌రికి చెరువు ప్రాంతాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. శేరిలింగంప‌ల్లి పరిధిలో మియాపూర్‌లోని ప‌టేల్ చెరువు వ‌ద్ద‌, గంగారం చెరువు వ‌ద్ద‌, ముల్ల‌క‌త్తువా చెరువు వ‌ద్ద‌, కాముని చెరువు వ‌ద్ద‌, దుర్గం చెరువు వ‌ద్ద‌, ఖాజాగూడ చెరువు వ‌ద్ద ఎస్టీపీల‌ను నిర్మిస్తామ‌న్నారు.

చెరువుల్లోకి మురికి నీరు చేరకుండా చేస్తే… దుర్గం చెరువు,హుస్సేన్ సాగర్ తరహాలో నగరంలోని మిగతా చెరువుల చుట్టూ వాక్ వేలను అభివృద్ది చేసుకోవచ్చునని కేటీఆర్ అన్నారు. చెరువులను సుందరీకరించుకోవడం ద్వారా కుటుంబంతో కలిసి గడిపే మంచి ఆహ్లాదకరమైన స్థలాలుగా వాటిని తీర్చిదిద్దవచ్చునన్నారు. కొత్తగా శంకుస్థాపన చేసిన ఎస్టీపీలతో దాదాపు 1200ఎంఎల్‌డీల మురికి నీటిని శుద్ది చేయవచ్చునని… మరో 700 ఎంఎల్‌డీలకు ఎస్టీపీలు ఏర్పాటు చేస్తే 100శాతం మురికి నీటిని శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్‌ దేశంలోనే టాప్‌లో ఉంటుందన్నారు. మూసీ నదిని సుందరీకరించాలంటే దానిలోకి వెళ్లే నీటిని మొదట ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే మూసీ అద్భుత వనరుగా ఉపయోగపడుతుందన్నారు. మిగిలిన 700ఎంఎల్‌డీల మురికినీటి శుద్ధికి దశలవారీగా మరిన్ని ఎస్టీపీలు నిర్మిస్తామన్నారు.అలాగే మూసీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్ మహానగర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం… మన పెద్దలు మనకు ఏ నగరాన్నైతే ఇచ్చారో… అంతకంటే మెరుగైన హైదరాబాద్‌ను భవిష్యత్ తరాలకు అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మరో మూడు చెరువులకు కూడా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తాం. ఫతేనగర్‌లో స్థానిక దర్గా,ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు మంజూరు. కేసీఆర్ సర్కార్ వచ్చాక జలమండలి ముందు ధర్నాలు లేవు. ఖాళీ బిందెలు కనిపించట్లేదు. 90శాతం సమస్య పూర్తయింది. మిగతా సమస్య కూడా పూర్తి చేస్తాం.
హైదరాబాద్‌ ప్రజలు,ముఖ్యంగా నాలాల చుట్టుపక్కల ఉండేవారు.. అందులో వస్తువులేవీ పడేయవద్దన్నారు.గతంలో నాలాలు క్లీన్ చేయించినప్పుడు ప్లాస్టిక్ సీసాలు,ఫర్నీచర్లు,పరుపులు… ఇలా రకరకాల వస్తువులు బయటపడ్డాయన్నారు. ఇన్ని వస్తువులు అందులో వేస్తే ఇక మురికి నీరు ఎలా పోతుందన్నారు. కాబట్టి నాలాలను శుభ్రంగా ఉంచుకుందామని అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని… దానికి ప్రజల సహకారం లేకపోతే ఆ కార్యక్రమాలు ముందుకు సాగవని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జలమండలి ముందు ధర్నాలు లేవన్నారు. గతంలో ఖాళీ బిందెలతో ధర్నాలు జరిగేవని… ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. నగరంలో 90శాతం తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. మిగతా 10శాతాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.