Corona

 

మళ్లీ మొదలైన కరోనా కల్లోలం

 

“ఒక పక్క 100 కోట్ల వాక్సిన్స్ చేశామని మోడి ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతుంటే మరో పక్క కరోన మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుంది. అగ్ర రాజ్యలైన అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా లలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు టీకా డోసులు వేసినా ఆంక్షలు లేకపోవడంతో కేసుల సంఖ్య పెరిగిపోతుంది. చైనా, బ్రిటన్ లో మళ్ళీ లాక్ డౌన్ ని విదిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను చిన్నా భిన్నం చేశాక భారత్ లో ప్రవేశించింది. కరోన సెకండ్ వేవ్ లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ప్రాణాలను కోల్పోవల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. మోడి ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోక పోతే మన దేశంలో కూడా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉంది.”

🔹(శ్రీధర్ యాలాల- ప్రశ్న న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)

ప్రపంచవ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇంగ్లండ్ లో 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. డెల్టా ఉత్పరివర్తనంలో ఏవై 4.2 రకం కేసులు పెరుగుతూ అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. 15 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతూ రష్యాలో రోజుకు 33 వేల కేసులు నమోదవుతున్నాయి. వెయ్యి మరణాలు సంభవిస్తున్నాయి.

దేశ జనాభాలో 29 శాతం మందికి రెండు టీకా డోసులు వేసినా ఆంక్షలు లేకపోవడంతో మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ వంటి నగరాల్లో ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో 4.18 లక్షల మది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆస్రేలియాలో డెల్టా ఉత్పరివర్తనంతో వ్యాధి ముదురుతోందని తెలుస్తోంది.

అగ్రరాజ్యం అమెరికాలో కూడా కొవిడ్ జడలు విప్పుతోంది. ఇప్పటికి 7.28 లక్షల మది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమెరికాలో రోజుకు 90 వేల కేసులు నమోదవుతున్నాయి. మూడొంతులకు పైగా బాధితులు ఆప్పత్రుల్లో చేరుతున్నారు. ఐసీయూల భారం పెరుగుతోంది. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తవుతున్నా వ్యాధి తీవ్రత కూడా అంతే స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాలో అదుపు తప్పుతున్న పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు నిబంధనలు పాటించకపోవడంతోనే కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోందని తెలుస్తోంది. 94 కోట్ల వయోజనుల్లో సుమారు 30 కోట్ల మందికే రెండు డోసుల టీకాలు వేశారు. దీంతో వ్యాధి తీవ్రత ముదురుతోందని సమాచారం. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచాన్ని వణికించేందుకు రెడీ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

🔹చైనాలో మళ్ళీ లాక్ డౌన్..

కరోనా పుట్టిల్లు చైనా మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. కోవిడ్ పరీక్షల వేగాన్ని పెంచి గురువారం భారీగా పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొన్ని ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా పరిమితులను తగ్గిస్తున్నాయి. కానీ, చైనా మాత్రం దేశీయంగా అన్నిటినీ మూసివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిహద్దులను మూసివేయడంతో కరోనా విషయంలో చైనా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో బాంబు చైనా పేలుస్తుందా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.

అధికారులు చెబుతున్నదాని ప్రకారం చైనా వరుసగా ఐదవ రోజు కొత్త కేసులను నమోదు చేసింది. ఎక్కువగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణంగా పర్యాటకులను పేర్కొంటున్నారు. జియాన్, గన్సు ప్రావిన్స్ అదేవిధంగా ఇన్నర్ మంగోలియా వెళ్ళే ముందు ఒక వృద్ధ జంట షాంఘైలో పర్యటించారు. రాజధాని బీజింగ్‌తో సహా కనీసం ఐదు ప్రావిన్సులు ప్రాంతాలలో సన్నిహిత పరిచయాలతో డజన్ల కొద్దీ కేసులు వారి ప్రయాణంతో ముడిపడి ఉన్నాయి. వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు చెబుతున్నారు. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడమే కాకుండా పర్యాటకులను పూర్తిగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిపై ఆంక్షలు విధించారు. వైమానిక ట్రాకర్ వరిఫ్లయిట్ డేటా ప్రకారం, ప్రభావిత ప్రాంతాలలోని విమానాశ్రయాలు వందల విమానాలను రద్దు చేశాయి.

జియాన్, లాంజౌలోని రెండు ప్రధాన విమానాశ్రయాలకు 60 శాతం విమానాలు రద్దు చేశారు. తమ పౌరులకు జారీచేసిన నోటీసులో ఇన్నర్ మంగోలియాలోని ఎరెన్‌హాట్ నగరం లోపల, వెలుపల ప్రయాణం నిషేధించారానీ, నివాసితులు తమ గృహాలను వదిలి వెళ్లవద్దని సూచించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ బుధవారం, ఇన్నర్ మంగోలియాలో కొత్త వైరస్ కేసులు మంగోలియా నుండి బొగ్గు దిగుమతులను ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది, ఎందుకంటే అక్కడి ఆంక్షల వలన సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడవచ్చని అధికారులు చెబుతున్నారు.

🔹భారత్ లో…

మన దేశంలో కూడా కరోన కేసులు భారీగా పెరిగాయి. ముందు రోజు 14 వెలుగా ఉన్న కేసులు అమాంతం 18 వెలకు పెరిగాయి. దాంతో క్రియాశీల కేసుల తగ్గుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రికవరీ కంటే కొత్త కేసులే అధికంగా ఉన్నాయి.

తాజాగా 12,47,506 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18,454 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసుల్లో 26 శాతం మేర పెరుగుదల కనిపించింది. నిన్న 17,561 మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల సంఖ్య 1,78,831కి చేరింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి చేరగా, రికవరీ రేటు 98.15 శాతం ఉంది. నిన్న మరో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4.52 లక్షల మందికి పైగా మహమ్మారికి బలయ్యారు.

🔹తెలంగాణలో…

ఇక తెలంగాణలో కూడా కేసుల సంఖ్య పెరుగుతుందని సమాచారం. మొదటి నుండి తెలంగాణ ప్రభుత్వంపై కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతుందన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. హై కోర్ట్ కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసింది. అయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య విషయంలో తన పద్దతిని మార్చుకోలేదు అని స్పష్టమవుతుంది. ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, పండగలు, ఎన్నికల ర్యాలీలు, రాజకీయ పార్టీల కార్యక్రమాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని అందువల్లే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుందని ఓ అధికారి తెలిపాడు.