Harish Rao

 

త్వరలో రూ.లక్ష లోపు రైతు రుణాల మాఫీ

 

సిద్దిపేట (ప్రశ్న న్యూస్) రైతులకు గుడ్ న్యూస్.. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఆపై కూడా మాఫీ చేస్తామని తెలియజేసింది. రూ. లక్ష లోపు రుణం మాఫీ చేస్తామని సంకేతాలను ఇచ్చింది. రైతు రుణమాఫీలో భాగంగా రూ.50 వేల నుంచి లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లోకి వడ్డీతో సహా జమచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తికావొస్తుందరి వివరించారు. లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి వచ్చే మార్చి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేసేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణ శివారులోని కిషన్‌నగర్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అలాగే సొంత నివేశనా స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఇందుకు సంబంధించి రూ.10వేల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. మెట్ట ప్రాంత వరప్రదాయినీ గౌరవెల్లి రిజర్వాయర్‌ మిగులు పనులను పూర్తి చేసేందుకు రూ.58కోట్లు మంజూరు చేశామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.42కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేశారన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రెస్‌ అకాడమీ ద్వారా రూ.20వేలు, మృతి చెందిన జర్నలిస్టులకు రూ.2లక్షలు ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి మూడేండ్ల పాటు రూ.3వేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నదని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక అక్రిడిటేషన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితావెంకట్‌ పాల్గొన్నారు.