revanth reddy

 

ఇంత బాధ్యతరహిత్యమా..?

 

🔹మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం మందిని తాగుబోతులుగా చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. మద్యం మత్తులోనే దారుణ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మహిళలపై దాడులు మద్యం వల్లనే జరిగాయని పోలీసు రికార్డులు చెపుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,750 రేప్ కేసులు నమోదయ్యాయని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మద్యం మత్తులో ఉండి ఆ ట్వీట్ చేశారా? అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్ తర్వాత పోలీసులు… నిందితుడి ఆచూకీ తెలిపితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారని అన్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా కేటీఆర్ ఎలా ట్వీట్ చేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో పెరిగిపోతున్న విష సంస్కృతిపై సీఎంకు నిఘా విభాగాలు నివేదికలు ఇవ్వడం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. డ్రగ్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని 9 దర్యాప్తు సంస్థలకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. 17వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ రాష్ట్రానికి వస్తున్నారని… ఆయనను తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కలిసేందుకు తాను అపాయింట్ మెంట్ కోరానని తెలిపారు. కీచకుడు రాజు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆ నీచుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే చిన్నారిపై హత్యాచారం ఘటనలో తాను మొదట చేసిన ట్వీట్ పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు పొరబాటున ట్వీట్ చేశానని వివరించారు. ఆ ట్వీట్ ను తొలగిస్తున్నట్టు ఓ ప్రకటన చేశారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడి విషయంలో తనకు తప్పుడు సమాచారం అందిందని వెల్లడించారు.నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని, అతడి కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితుడ్ని పట్టుకునేందుకు అందరూ సహకరించాలని, తద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని అడిగారు.

సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిందితుడు రాజు ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతను స్మార్ట్ ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియా సైట్లు యూజ్ చేయకపోవడం వల్ల కనుక్కొవడం కష్టంగా మారింది. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి రాజు మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజు చేసిన నేరం తెలియదన్నాడు. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు. గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది.