Priyanka Gandhi

 

ప్రతి గ్రామానికి కాంగ్రెస్

 

🔹కాంగ్రెస్ ప్రతిగ్య యాత్ర, వేలాది కిలోమీటర్లు
🔹యోగి సర్కార్‌కు చెక్..
🔹ప్రియాంకా గాంధీ స్కెచ్

 

లక్నో (ప్రశ్న న్యూస్) వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షలా తయారయ్యాయి. ఆ అయిదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల అధికారంలో ఉండటంతో ఎన్నికలను బీజేపీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. నాలుగింట్లో ఏ ఒక్క చోటైనా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తే.. తలదించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొనడం ఖాయం. దాని ప్రభావం 2024 నాటి సార్వత్రిక ఎన్నికలపై పడతాయని బీజేపీ భావిస్తోంది. అందుకే- ముఖ్యమంత్రులను సైతం మార్చడానికి వెనుకాడట్లేదు కమలనాథులు. అయిదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నది ఉత్తర ప్రదేశ్. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, 2019 నాటి లోక్‌సభ పోల్స్‌లో గానీ బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రం ఇది. దేశ రాజకీయాల్లో కూడా అత్యంత కీలకం. కేంద్రంలో అధికారంలో ఎవరు ఉండాలనే విషయాన్ని నిర్ధారించే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ను గుర్తిస్తుంటారు రాజకీయ విశ్లేషకులు.

దీనికి కారణం.. అక్కడ 80 లోక్‌సభ స్థానాలు ఉండటమే. 403 అసెంబ్లీ స్థానాలు యూపీలో ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఏకచ్ఛాత్రాధిపత్యంగా ఏలుతోంది బీజేపీ. వచ్చే ఏడాది నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి తెర దించడానికి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే పక్కాగా స్కెచ్ వేస్తోన్నాయి. దాన్ని అంతే పక్కాగా ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాయనేది ఆసక్తి రేపుతోంది. కాగా- ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా- పార్టీ తురుఫుముక్కగా భావిస్తోన్న ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దించింది. ప్రస్తుతం ఆమె తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తోన్నారు. తాజాగా- ఆమె సారథ్యంలో భారీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. ప్రతిజ్ఙా యాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరగబోతోంది. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన ఆరంభం కానుంది. దీనికి ప్రియాంకా గాంధీ వాద్రా సారథ్యాన్ని వహిస్తారు. ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేలా, కాంగ్రెస్ నాయకులు అడుగు పెట్టేలా దీన్ని రూపొందించారు.

ఒక రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల మేర యాత్ర అంటే మాటలు కాదు.. అసాధారణ విషయం. దాన్ని ఎలాగైనా విజయవంతం చేసి తీరాలనే పట్టుదలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదంటూ ఇదివరకే సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించడం, మరో మాజీ ముఖ్యమంత్రి మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ కూడా కాంగ్రెస్‌తో పొత్తుపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో- కాంగ్రెస్‌కు ఒంటరిపోరు తప్పేలా కనిపించట్లేదు. దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలు తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. 12 వేల కిలోమీటర్ల ప్రతిజ్ఙాయాత్రను ప్రారంభించబోతోంది. ప్రతి గ్రామానికి కాంగ్రెస్ అనే నినాదంతో పార్టీ ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకూ అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ అధిష్ఠానం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ లల్లూ తెలిపారు.