Vaccination

 

వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనమెక్కడ.?

 

* కరోనా టీకాలలో తెలంగాణ చిట్టచివర

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) పారసిటమాల్ తో కరోనా పోతుందన్న సీఎం నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తాం. హెడ్డింగ్ చూడగానే మీకు అర్థం అయ్యే ఉంటుంది. తెలంగాణలో మహమ్మారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఇది. ఓవైపు టెస్టులు సరిగ్గా చేయడం లేదని విమర్శలు, కేసులను తక్కువగా చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీకా ప్రక్రియ అన్నా సక్రమంగా సాగుతుందా.? అంటే అదీ లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా టీకాలు వేయడంలో తెలంగాణ చిట్టచివరన నిలిచింది. తెలంగాణలో ఇప్పటిదాకా 2.84 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. వ్యాక్సినేషన్ లో ఓవరాల్ రాష్ట్రాల లిస్టు చూస్తే టాప్ 10 లో తెలంగాణ జాడే లేదు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్ లో ఈ వివరాలన్నీ అప్ డేట్ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక 7వ స్థానంతో ముందు వరుసలో నిలవగా తమిళనాడు 9, ఏపీ 10, కేరళ 11వ స్థానంలో ఉన్నాయి. ఇక తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. కర్నాటకలో ఇప్పటిదాకా రెండు డోసులు కలిపి 6.05 కోట్లు, తమిళనాడు 5.26 కోట్లు, ఏపీ 4.63 కోట్లు, కేరళ 3.70 కోట్ల టీకాల పంపిణీ జరిగింది. అదే తెలంగాణలో అయితే 2.84 కోట్ల మందికే డోసులు మాత్రమే అందాయి. వ్యాక్సిన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి కరోనా బారి నుండి ప్రజలను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోవడం పై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.