శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు – సీఎం జగన్
సీఎంను తిట్టిస్తారా..?
అధికారంలోకి రాలేమన్న అక్కసుతో సీఎంను వ్యక్తిగతంగా తిట్టించడానికి కూడా వెనుకాడటం లేదని జగన్ అన్నారు. చివరికి సీఎంను బూతులు తిట్టించే స్థాయికి దిగజారరని ఆరోపించారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ఆయన తల్లిని తిట్టించారని మండిపడ్డారు. ఇక రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పిల్లలు, విద్యార్థులపై కళంకమైన ముద్రవేస్తున్నారని ఆరోపించారు. వీళ్లు టార్గెట్ చేస్తున్నది సీఎంని, ప్రభుత్వాన్ని కాదని.., రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపైనా దాడి చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. పిల్లల్ని డ్రగ్స్ బానిసలుగా చిత్రీకరిస్తున్నారు. డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రకటించినా.. డీజీపీ, విజయవాడ సీపీ వివరణ ఇచ్చినా వినకుండా పథకం ప్రకారం క్రిమినల్ బ్రెయిన్ తో రాష్ట్ర పరువును తీస్తున్నారని జగన్ అన్నారు.
రాజీపడే ప్రసక్తే లేదు..
రాష్ట్రంలో శాంతి భద్రతలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని.. ఈ విషయంలో తన.. మన అనే భేదం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు జగన్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల మీద కులపరమైన దాడులు జరిగితే ఎవర్నీ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తీవ్రవాద కార్యకలాపాలను, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుసుకోవాలన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అమరవీరులకు నివాళి….
అంతకుముందు సీఎం జగన్ విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అమరులైన పోలీసు కుటుంబాలకు సమాజం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత యేడాది కాలంలో మరణించిన పోలీసు సోదరులకు ప్రభుత్వం తరపున శ్రద్దాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సమాజం కోసం బాధ్యత లు నిర్వర్తిస్తున్న పోలీసు సేవలను గుర్తించామన్న సీఎం… గతంలో ఎవరూ చేయని విధంగా దేశంలో తొలిసారిగా వీక్లీ ఆఫ్ లు అమలు చేశామని గుర్తుచేశారు. కోవిడ్ వల్ల ఇది కొంతకాలంగా అమలు చేయలేక పోయామని.., ఈరోజు నుంచి మళ్లీ వీక్లీ ఆఫ్ లను అమలు చేస్తామని తెలిపారు. 2017నుండి బకాయిపెట్టిన 1500కోట్లను మేము విడుదల చేశామన్న జగన్.., పోలీసు శాఖ లో ఖాళీలను భర్తీ చేసేలా నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.