ప్రతిపక్షాలకు కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్
ఆ పథకం బయటకు తీస్తే బ్రహ్మాస్త్రమే..?
కసరత్తుల్లో నిమగ్నమైన సీఎం.?
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది నెలల క్రితం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ… తమ అమ్ములపొదిలో దాచి ఉంచిన పథకాలను బయటకు తీస్తే ప్రతిపక్షాలు ఖతమే అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన రైతులకు సంబంధించి మరో కీలక పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకరకంగా ఇది కేసీఆర్ వదలబోయే బ్రహ్మాస్త్రం అని… ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టడం లాంటిదేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ తీసుకురాబోతున్న ఆ పథకమేంటి…?
కేసీఆర్ వదలనున్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి…
తెలంగాణలో రైతులకు నెలకు రూ.5వేలు చొప్పున ఫించన్ ఇచ్చే పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పథకంపై ఆయన సీరియస్‌గా సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ తీసుకురాబోయే ఈ పథకం టీఆర్ఎస్‌కు ఒకరకంగా బ్రహ్మాస్త్రమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ పథకంతో రైతు లోకం ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్‌కే పడుతాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతు బంధు,రైతు భీమా పథకాలతో రైతు వర్గానికి చేరువైన కేసీఆర్… ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఫించన్ పథకంతో ఆ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆచరణ సాధ్యమేనా…
రైతులకు నెలకు రూ.5వేల ఫించన్… ఈ పథకం వినడానికి బాగానే ఉన్నా… ఆచరణలో సాధ్యమేనా అన్న అనుమానాలు కలగకమానవు. రాష్ట్రంలో ఎక్కువ కుటుంబాలు వ్యవసాయధారిత కుటుంబాలే.లక్షల సంఖ్యలో వారి జనాభా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎంతమందికని ఈ పథకాన్ని అమలుచేస్తారనే ప్రశ్న తలెత్తకమానదు. ప్రస్తుతం గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బంధు,రైతు భీమా పథకాలు అందుతున్నాయి. ఇదే లెక్కన రైతులకు నెలకు రూ.5వేల ఫించన్ అమలుచేయడం సాధ్యమేనా..? ఇప్పటికే ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చివరి కంటా అమలవుతుందా… రాష్ట్రంలోని దళితులందరికీ చేరుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్ మరో పథకం కోసం కసరత్తు చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
పథకాలతో హ్యాట్రిక్ కొడుతారా లేక మిస్‌ఫైర్ అవుతాయా…
తెలంగాణలో రెండుసార్లు సునాయాసంగా విజయాలు అందుకున్న టీఆర్ఎస్‌కు 2023 నల్లేరు మీద నడక కాదనే విషయం తెలిసిపోయిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు మరిన్ని సంక్షేమ పథకాలను విరుగుడుగా ఆయన ప్రయోగించబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసిస్తే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఈ పథకాలు ఆయనకు ఓట్లు తెచ్చి పెడుతాయా.. లేక మిస్‌ఫైర్ అవుతాయా అన్న చర్చ లేకపోలేదు.ఇప్పటికే దళిత బంధు పథకంపై ఇలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ పథకం దళితులందరికీ చేరకపోతే ఆ వర్గంలో వ్యతిరేకత పెరిగి టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ లెక్కన కేసీఆర్ తీసుకురాబోయే రైతు ఫించన్ పథకం కూడా రైతులందరికీ చేరకపోయినా… లేక కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తూతూ మంత్రంగా అమలుచేసినా…అది మొదటికే మోసం తెస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మున్ముందు మరిన్ని పథకాలు…
హుజురాబాద్ ఉపఎన్నికతో కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఎంతమేర ఫలితాన్నివ్వబోతుందనేది తేలిపోనుంది. హుజురాబాద్‌లో దాదాపు 20వేల పైచిలుకు దళిత కుటుంబాలు ఉండగా… ప్రతీ కుటుంబానికి దళిత బంధు పథకం అమలుచేస్తున్నారు. ఇప్పటికే చాలామందికి చెక్కులు పంపిణీ చేశారు. అయితే ఈ వర్గం ఓట్లన్నీ హుజురాబాద్‌లో గంపగుత్తగా టీఆర్ఎస్‌కు పోల్ అవుతాయా లేదా అన్నది చూడాలి. ఒకవేళ పోల్ అవకపోతే టీఆర్ఎస్ పాచిక పారనట్లే. జనం ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకుని ఈటలకు ఓటేసినట్లయితే… మున్ముందు ప్రవేశపెట్టబోయే పథకాల విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే ఆయన మదిలో మరిన్ని సంక్షేమ పథకాలు పురుడు పోసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్ నుంచి మరిన్ని అస్త్రాలు పథకాల రూపంలో వస్తాయనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.