Majlis Kotanu BJP Baddalu Kodutunda.?
మజ్లిస్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా.?
– మహిళా అభ్యర్థికి చాన్స్ ఇచ్చిన బీజేపీ..
– బీజేపీ మహిళా అభ్యర్థి మజ్లిస్ కోటను బద్దలు కొడతారా.?
-సంచలనానికి చాన్స్ ఎంత.?
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రానున్న లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. అసదుద్దీన్ ఒవైసీ కోటను బద్దలు కొట్టేందుకు కొత్త వ్యూహాలను రచిస్తోందా.? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానం 1984 నుంచి ఎంఐఎం చేతిలోకి వెళ్లిపోయింది. నాడు అక్కడి ఎంఐఎం అభ్యర్థిగా ఉన్న సలావుద్దీన్ ఒవైసీ 2004 వరకు వరుసగా ఆరు పర్యాయాలు విజయం సాధించగా, ఆయన మరణం తర్వాత వారసుడైన అసదుద్దీన్ నేటి వరకు ఎంపీగా గెలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికిలేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకి గట్టి ప్రత్యర్థిగా బీజేపీ నిలుస్తూ వస్తోంది.
–హైదరాబాద్ పరిధిలో త్రిముఖ పోరు..
దేశ వ్యాప్తంగా మోడీ ప్రభ వెలిగిపోతున్న ఈ సమయంలోనైనా ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్ఠానం గట్టి పట్టుదలగా ఉంది. అందుకే, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి విజయాన్ని సాధించాలని, తద్వారా అసదుద్దీన్, అతని పార్టీకి చెక్ పెట్టాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఒవైసీ ప్రభావం ఎంతో కొంత తగ్గిందని, దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంని గట్టిగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తోందని, కనుక ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు గట్టిగా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే ఈసారి ఇక్కడ భారీగా ముస్లింల ఓట్లలో చీలిక రావొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ సమయంలో బలమైన, కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే ఒవైసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోంది.
-మహిళా అభ్యర్థితో కొత్త ప్రయత్నం..
కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత కోఠి మహిళా కళాశాలలో అనంతరం నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ఈమె భరతనాట్య కళాకారిణి కూడా. విరించి హాస్పిటల్స్ యజమానిగానే గాక మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే బటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్’ అనే ఫిన్కారొూ నడుపుతున్నారు. ఈమె భర్త విశ్వనాథ్ కూడా వ్యాపారవేత్తే. మాధవీలత లోపాముద్రా ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా చాలా కాలంగా పాతబస్తీ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
Know More : Revanth Operation Greater
పేదల బస్తీల్లో హెల్త్ క్యాంపులు పెట్టి, ఉచితంగా మందులు ఇవ్వటం, ట్రైలరింగ్ కేంద్రాలు పెట్టి మహిళలకు శిక్షణనిచ్చి, వారికి తగిన పనిని ట్రస్ట్ తరపున కల్పించటంతో పాటు ప్రజ్ఞాపూర్ దగ్గర 4 లక్షల చదరపు అడుగుల్లో గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలనే ప్రచారం చేస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ రోజూ వందలాది మందికి భోజనాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పంపి స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు. అటు సాధుసంతులతో సమావేశాలు పెట్టించటం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాతబస్తీలోని హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు.
మొదటి నుంచి మజ్లిస్ కు పోటీ ఇచ్చేది బీజేపీనే..
బీజేపీ లోక్సభకు బద్దం బాల్ రెడ్డి హయాంలో ఎంఐఎంకు గట్టిగా పోటీ ఇవ్వగలిగింది. 1991 లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి 4,54,823 ఓట్లు రాగా, బాల్రెడ్డికి 4,16,299 ఓట్లు వచ్చాయి. ఒవైసీ కేవలం 39,524 ఓట్లతో గెలిచారు. హైదరాబాద్ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు ఎంఐఎంకు వచ్చిన అతి తక్కువ మెజార్టీ ఇదే, అలాగే 1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్ రెడ్డికి 1,14, 173 ఓట్లు, 1999 ఎన్నికల్లో 3,87,344 ఓట్లు సాధించి రెండో స్థానం సాధించారు. నాటి నుంచి బీజేపీ ఈ స్థానంలో తన పట్టును నిలుపుకుంటూనే వచ్చినా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ సాయంతో ఎంఐఎం ఇక్కడ గెలుస్తూ వస్తోంది.
కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఎంఐఎం ఇప్పుడు కాస్త ఉక్కపోతను ఎదుర్కొంటోంది. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల పరంగా దీన స్థితిలో ఉన్న పాతబస్తీలో పెద్ద సంఖ్యలో వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన హిందీ మాట్లాడే ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బాగా చదువుకున్న, ఆర్థిక వనరులున్న, హిందీలో ప్రజలతో మమేకమయ్యే ఒక మహిళను బరిలో దింపితే త్రిముఖపోరులో సత్తా చాటవచ్చని బీజేపీ అంచనా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉమాభారతి, మోడీ, అమిత్ షా వంటి నేతల రోడ్ షోలు, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పలుకుబడి, ఎంబీటీ ఓటు బ్యాంకుతో పాటు దశాబ్దాలుగా ఒవైసీ అంటే మొహం మొత్తిన యువ, అభ్యుదయ ముస్లింల మద్దతూ తమకే లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది.
ప్రభావం కోల్పోతూ వస్తున్న మజ్లిస్..
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఏర్పడి 66 ఏళ్లు అయింది. మజ్లిస్ ఆవిర్భావం తర్వాత 1960 వసంవత్సరంలో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 24 డివిజన్లలో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నగరంలోని మల్లేపల్లి డివిజన్ నుంచి కార్పొరేటరుగా ఎన్నికయ్యారు. అనంతరం 1962వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి, హైదరాబాద్లోని ఫత్తర్ గట్టి నియోజకవర్గం నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను మజ్లిస్ కైవసం చేసుకుంది. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి, 34 సంవత్సరాలు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు.
పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒవైసీ కుటుంబం పాగా వేసింది. గతంలో ఎంపీగా ఉన్న సలావుద్దీన్ ఒవైసీ మరణానంతరం అతని ఇద్దరు కుమారులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు వరుస విజయాలతో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఓటమి ఎరగని వీరుల్లా ఒవైసీ బ్రదర్స్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. 1984 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. నాటి నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు, 2002లో ఎంసీహెచ్ ఎన్నికలు జరిగినప్పుడు మజ్లిస్ మళ్లీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2007వ సంవత్సరంలో అసెంబ్లీ నుంచి మొట్టమొదటిసారి శాసనసభ మండలి ఎన్నికతో రాష్ట్ర శాసన మండలిలోకి ప్రవేశించింది. తండ్రి సాలార్ మరణం తర్వాత అతని పెద్దకుమారుడైన బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆసద్ నేతృత్వంలో 2009 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మజ్లిస్ విజయం సాధించింది.
తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ మలక్ పేట, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా సీట్లను గెల్చుకొని తన సత్తాను చాటుకుంది. కానీ ప్రభావం తగ్గినట్లు మాత్రం స్పష్టమయింది. నాంపల్లి, యాకుతురా నియోజకవర్గాల్లో ఏఐఎంఐఎం గట్టి పోటీని ఎదుర్కొంది. మజ్లిస్ యాక్కుత్పురా అభ్యర్థికి ఎంబీటీ నాయకుడు అమ్హ్మదుల్లా ఖాన్ గట్టి పోటీ ఇచ్చి కేవలం 878 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాంపల్లిలోనూ కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీ పోరు సాగింది. పాతబస్తీలో మజ్లిస్ ను ఓడించడం కష్టమే కానీ అసాధ్యం కాదు. హిందూ ఓట్లు అన్నీ ఏకీకృతం అయితే చీలిపోకుండా చూసుకుంటే మజ్లిస్ కోటను బద్దలు కొట్టేయవచ్చు.