ఎన్ని కుట్రలు చేసినా నా గెలుపును అడ్డుకోలేరు – ఈటల
హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) అధికార పార్టీ అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నా.. ప్రజలు మాత్రం తనవెంటే ఉన్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దళితబంధు పథకం అమలును అడ్డుకుంటున్నానంటూ తనపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తాను దళిత బంధును అడ్డుకున్నట్లు నిరూపించగలరా? అని అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. పథకాన్ని రాష్ట్ర మొత్తం అమలు చేసే సత్తా లేకనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈటల. సీఎం కేసీఆర్‌వి కేవలం ఎన్నికల మాటలే తప్ప చేతలు కావన్నారు. కేసీఆర్‌కు ఎన్నికల సమయంలోనే ఎస్సీలు, నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయన్నారు. ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కుర్చీ మీద కన్ను వేసిండు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేశాడని మంత్రి హరీశ్ రావు అంటున్నారు. ఇది నిజమా? కాదా? అనేది ప్రజలే చెప్పాలని ఈటల వ్యాఖ్యానించారు. కుడి భుజం, తమ్ముడు అని పిలిపించుకున్న తాను ఇవాళ దెయ్యాన్ని ఎలా అయ్యానో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చానని.. అదే కేసీఆర్‌కు నచ్చలేదని అన్నారు ఈటల. కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితిమైతే తాను ఆస్పత్రులను పరిశీలించేందుకు తిరిగానని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారని మండిపడ్డారు ఈటల. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారన్నారు. దళితబంధు వద్దని తాను లేఖ రాసినట్లు నిరూపిస్తారా? దళితబంధు ప్రకటించి 70 రోజులు అయ్యింది. ఇప్పటి వరకు ఎందుకు అందరికీ అందించలేదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ మేలు చేస్తాడే కానీ.. కీడు తలపెట్టడు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి.. సంపన్నులకు కాదని కొట్లాడాను. అవన్నీ అడిగితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారని ఈటల రాజేందర్ తెలిపారు.
హరీష్ రావుని ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి అడిగిందని యువతిని ఇష్టం వచ్చినట్లు కొడతారా? అని ఈటల మండిపడ్డారు. అన్ని కులాల వారికి దళితబంధు లాంటి స్కీం పెట్టాలన్న తాను.. దళితబంధు ఆపాలని ఫిర్యాదు చేస్తానా అని ప్రశ్నించారు. హుజురాబాద్ మండలం శాలపల్లిలోని ఇందిరానగర్లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్థికంగా రాష్ట్రం కుప్పకూలి పేదరికం పెరిగిపోయింది. ఉద్యోగాలు వస్తాయని 1200 మంది అమరులైతే.. ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. పిల్లలకు ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులు మురిసిపోవాల్సింది పోయి.. కూలీ పని చేసి పిల్లలకు పెడుతున్నారు. ఎన్నికలప్పుడే నోటిఫికేషన్లు గుర్తొస్తాయి. ఎన్నికలప్పుడే దళితులు గుర్తుకు వస్తారు. కేసీఆర్ ప్రజలు మెచ్చే పద్ధతిలో పనిచేయడం లేదు. హరీశ్ రావు మీటింగ్ దగ్గర ఉద్యోగాలు ఎప్పుడిస్తారని నిరోషా అనే యువతి ప్రశ్నించింది. అడిగినందుకు ఆమెను కొట్టారు. చివరకు ఆమెకు పిచ్చిలేచిందని, మెంటల్ డిజార్డర్ ఉందని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. ఈ సర్కారు ఉంటది పోతది. ఇది నిజాం సర్కారు కాదు. తాతకు, తండ్రికి, కొడుకుకు, మనవడికి రాజ్యాధికారం అప్పగించడానికి ఐదేళ్ల కోసం మాత్రమే వీళ్లకు అధికారం ఉంది. కేసులు పెట్టించే అధికారం, కొట్టించే అధికారం లేదు. ఇలాంటి సంఘటనలు గుర్తుంచుకుని సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతపెడతారు అని ఈటల రాజేందర్ అధికార పార్టీని హెచ్చరించారు.