Vaccine

 

అక్టోబర్ నుంచి మిగులు కరోనా వ్యాక్సిన్ల ఎగుమతులు, విరాళాలు

 

🔹స్పష్టం చేసిన కేంద్రం

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఉత్పత్తి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లను అక్టోబర్ నెల నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడం, విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం తెలిపారు. అయితే, భారత ప్రజలకు వ్యాక్సిన్లు పంపిణీ చేయడమే తమకు ప్రాధాన్యమని స్పష్టం చేశారు. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాలను వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం, కోవాక్స్‌కు సరఫరా చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ మాసంలో 30 కోట్లకు పైగా డోసులు, వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 100 కోట్లకుపైగా టీకా డోసులు అందుతాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. మన దేశ పౌరులకు వ్యాక్సిన్ అందించిన తర్వాతనే, మిగులు టీకాలను విదేశాలకు ఎగుమతి చేయడం, విరాళాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వసుదైక కుటుంబం అనే నినాదానికి అనుగుణంగా అక్టోబర్-డిసెంబర్ నెలల్లో వ్యాక్సిన్ మైత్రి, కోవాక్స్ ఎగుమతులు, విరాళాలుగా ఇస్తామన్నారు. కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరులో భాగంగా టీకాలను విదేశాలకు అందించడం జరుగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో కరోనా టీకాల పరిశోధన ఉత్పత్తి ఏకకాలంలో భారీ ఎత్తున కొనసాగుతాయని కేంద్రమంత్రి వివరించారు. భారత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రపంచ దేశాలకు ఓ రోల్ మోడల్ అని వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని తెలిపారు. గతంలో భారత్ దాదాపు 100 దేశాలకు 6.6 కోట్ల డోసుల వ్యాక్సిన్లను విక్రయాలు, విరాళంగా అందించిందని తెలిపారు. అయితే, దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడటంతో విపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో విదేశాలకు టీకాల ఎగుమతులు, విరాళాలు నిలిపివేసింది. ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11,77,607 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,256 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.34 కోట్ల చేరింది. ఆదివారం 295 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.45 లక్షలకు చేరింది. ఆదివారం 43,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.27కోట్లకు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.72 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3.18 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.95 శాతానికి తగ్గింది. ఆదివారంనాడు 37,78,296 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 80,85,68,144కు చేరింది.