పంజాబ్ సంక్షోభానికి తెర
సీఎం చన్నీతో సిద్ధూ భేటీ
పీసీసీ ఛీఫ్ గా కొనసాగాలని నిర్ణయం
ఛండీగఢ్ (ప్రశ్న న్యూస్) పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న టీ కప్పులో తుపాను సమసిపోయినట్లే కనిపిస్తోంది. అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి తొలగించాక తనను సీఎం చేస్తుందని కలలు కన్న పీసీసీ ఛీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆ కోరిక నెరవేరకపోయే సరికి పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది. అయితే వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం ఆయనతో సాగించిన సంప్రదింపులు ఫలించినట్లే కనిపిస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ గా కొనసాగాలని సిద్ధూ నిర్ణయించుకున్నట్లు ఆయన వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఎంపికను తప్పుబడుతున్న సిద్ధూ.. గురువారం సీఎం చన్నీతో భేటీ అయ్యారు. కేబినెట్ లో మార్పులపై చర్చించారు. అయితే వివరాలు మాత్రం బయటికి రాలేదు. కానీ సమావేశం తర్వాత మాత్రం సిద్ధూ పీసీసీ ఛీఫ్ గా కొనసాగుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ ప్రకటన చేశారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లయింది. పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో తాజాగా సీఎం అయిన చరణ్ జీత్ సింగ్ చన్నీ.. కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఇవాళ సిద్దూతో భేటీ తర్వాత ఆయన వచ్చే నెల 4న కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతకుముందు సిద్ధూతో ఫోన్ లో కూడా మాట్లాడిన సీఎం చన్నీ… పార్టీయే సుప్రీం అని, ప్రభుత్వం కూడా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తుందని సిద్ధూకు తెలిపారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలుంటే కలిసి కూర్చుని మాట్లాడుకుందామని ఆహ్వానించారు. దీంతో సాయంత్రం సిద్ధూ వెళ్లి చన్నీని కలిశారు. దీంతో కేబినెట్ పదవుల విషయంలో సిద్ధూ అభ్యంతరాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చల్లో ఏం అంగీకారం కుదిరిందనే విషయాన్ని మాత్రం ఇద్దరూ బయటపెట్టలేదు. మరోవైపు వీరితో విభేదీస్తున్న కాంగ్రెస్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాజాగా భేటీ అయినప్పటికీ బీజేపీలో చేరబోనని, కాంగ్రెస్ లో ఉండబోనని తేల్చిచెప్పారు. దీంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతువ్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.