KCR & JGN

 

అప్పట్లో కేసీఆర్‌.. ఇప్పుడు జగన్..

 

🔹తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న సీన్

 

హైదరాబాద్/అమరావతి (ప్రశ్న న్యూస్) రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకప్పుడు గెలుపు నల్లేరు మీద నడక అని భావించే నేతలు, పార్టీలు.. ఒక్కోసారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఇక గతంలో ఎంత శ్రమించినా.. గెలుపు దక్కని పార్టీలు.. ఇప్పుడు భారీ స్థాయిలో విజయం దక్కించుకునే పరిస్థితులు ఏర్పడం విశేషం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మారిన రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారింది. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఆ తరువాత కొన్నేళ్ల పాటు అన్ని ఉప ఎన్నికల్లోనూ భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఇదే ఊపుతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే రెండోసారి గెలిచిన తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అంత సులుభంగా తాము అనుకున్న ఫలితాలు సాధించడం లేదు. మొదట్లో వచ్చిన హుజూర్ నగర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ.. ఆ తరువాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తరువాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బాగానే కష్టపడింది. ఇక ఇప్పుడు అనుకోని విధంగా వచ్చిపడ్డ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతోందనే టాక్ ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీలోని అధికార వైసీపీ మాత్రం ఈ విషయంలో భిన్నంగా మారుతోందనే చర్చ జరుగుతోంది. 2014లో అధికారం దక్కించుకోలేకపోయిన వైసీపీ.. ఆ తరువాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం స్వయంగా జగన్ రంగంలోకి దిగిన కష్టపడినా.. ఫలితం అనుకూలంగా రాలేదు. అయితే ఆ తరువాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ హవా కనిపించింది. ఇక ఇప్పుడు బద్వేల్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లోనూ వైసీపీ ఆధిపత్యం ముందుగానే కనిపిస్తోంది. పోటీకి టీడీపీ దూరంగా ఉండగా.. జనసేన కూడా దూరమే అని ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉంటామని ప్రకటించింది. అయితే ఈ రెండు పార్టీలు వైసీపీని సవాల్ చేసే స్థాయిలో లేకపోవడంతో.. బద్వేల్‌లో తమకు భారీ గెలుపు ఖాయమని ఆ పార్టీ యోచిస్తోంది. ఏపీ, తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం.. ఒకప్పుడు తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్‌కు దక్కిన పూర్తి రాజకీయ ఆధిపత్యం.. ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్‌కు దక్కిందని చర్చించుకుంటున్నారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడైనా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.