Modi

 

అసలేమిటీ ఓబీసీ బిల్లు

 

🔹డేటా లేకుండా ఓబీసీ రిజర్వేషన్లా.?
🔹పార్లమెంట్ ఆమోదంతో కొత్త చట్టంగా
🔹సుప్రీంకోర్టు వద్దన్నా రిజర్వేషన్లపై మోదీ దూకుడు
🔹ఓబీసీ చట్టంతో వచ్చే మార్పులేంటి.?

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశంలో అనేక దశాబ్దాలుగా అమలవుతోన్న రిజర్వేషన్ల విధానంలో సంచలన మార్పులకు అవకాశం కల్పిస్తూ, స్థానికంగా ఉండే ఓబీసీ కులాలకు కోటా కల్పించే విషయంలో రాష్ట్రాల చేతికే పవర్స్ అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లు(127 రాజ్యాంగ సవరణ బిల్లు-2021)కు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు, బుధవారం నాడు రాజ్యసభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై కొత్త చట్టం రానుంది. దానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర, ఆ తర్వాత గెజిట్ విడుదల ఇక లాంఛనమే. ఓబీసీ బిల్లుపై పార్లమెంట్ లో పరిణామాలు, అసలు ఈ బిల్లు ప్రత్యేకత, దీని వల్ల రాష్ట్రాలకు, ఓబీసీలకు కలిగే ప్రయోజనాల ఏంటి, మొత్తం వివరాల్లోకి వెళ్తే. సామాజికంగా వివక్ష ఎదుర్కొనే ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు ఎంతుడాలనేదానిపై స్పష్టత ఉన్నప్పటికీ, ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీల) రిజర్వేషన్ల విషయంలో మాత్రం తరచూ న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. స్థానిక అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్రాలు రిజర్వేషన్ కోటాలను పలు మార్లు వరించినా, సదరు మార్పులు సుప్రీంకోర్టులో కొట్టుడుపోవడం జరిగేది. దీంతో రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించేలా 127వ రాజ్యాంగ సవరణ బిల్లును మోదీ సర్కారు తీసుకొచ్చింది. బుధ‌వారం రాజ్యసభలో దీనికి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తిర‌స్క‌రించిన రాష్ట్రాల హ‌క్కులు ఈ బిల్లు ద్వారా తిరిగి పున‌రుద్ధ‌రించ‌బ‌డ‌తాయని వ్యాఖ్యానించారు.

కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ మద్దతు పలికాయి. అయితే, బీజేపీ సహా అన్ని పార్టీల ఎంపీలూ ఓబీసీల డేటాపై ఆందోళన వ్యక్తం చేశారు. కులాల ఆధారంగా జనాభా లెక్కలను చేపడితే తప్ప ఓబీసీ డేటాపై స్పష్టత రాబోదని ఎంపీలు అన్నారు. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో మాట్లారు. ఓబీసీలకు ప్రయోజనం చేకూరే ఈ బిల్లును తాము ఆహ్వానిస్తున్నామన్నారు. ఇక తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ డాక్ట‌ర్ బండా ప్ర‌కాశ్ ఓబీసీ బిల్లుపై మాట్లాడుతూ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఏ డేటా ఆధారంగా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పరిమితిని 50 శాతంగా నిర్ధారించిందో అర్థం కావడంలేదని, దానికేమైనా శాస్త్రీయ ఆధారం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో 1931 నుంచి జనాభా లెక్కలు జరుగుతున్నా, ఇప్పటిదాకా ఓబీసీ లెక్క‌ల్ని తేల్చలేదని, రాబోయే జనాభా లెక్కల్లోనైనా ఓబీసీ జ‌నాభాను లెక్కించాలని, ఎటువంటి డేటా లేకుండా రిజర్వేషన్ల అమలు ఇబ్బందికరమని ఎంపీ ప్రకాశ్ అన్నారు. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొంది, ఇవాళ రాజ్యసభలోనూ పాసైన ఓబీసీ బిల్లును కేంద్రం రాష్ట్రపతి వద్దకు పంపనుంది. ఫైలుపై సంతకం చేయడంతోపాటు గెజిట్ విడుదలతో ఓబీసీ చట్టం అమలులోకి రానుంది. ఓబీసీ బిల్లు ప్రధానంగా ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించడం. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ పలు రాష్ట్రాలు తీర్మానాలు, జీవోలు చేసినా, అవేవీ చెల్లుబాటు కాబోవని ఈ ఏడాది మే 5న సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులివ్వడం, ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రమే చట్ట సవరణ తప్పనిసరి కావడంతో మొదలైన ప్రక్రియ ప్రస్తుత దశకు చేరింది. మహారాష్ట్రలోని మరాఠాలను ఓబిసిలో చేర్చడం ద్వారా రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయాన్ని నిలిపేసిన సందర్భంలో 102 రాజ్యాంగ సవరణను ప్రస్తావిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 102 వ సవరణలోని కొన్ని నిబంధనలను స్పష్టం చేయడానికే ఓబీసీ సవరణ బిల్లును తెచ్చారు. 1993 నుంచి కేంద్ర రాష్ట్రాలు ఓబీసీలకు ప్రత్యేక జాబితాలను తయారు చేస్తున్నా 2018 రాజ్యాంగ సవరణతో అది నిలిచిపోయింది. ప్రస్తుత బిల్లుతో పాత విధానం మళ్లీ అమలు చేస్తారు. దీని కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A సవరణ జరుగుతోంది. దీనితో పాటు, ఆర్టికల్ 338B మరియు 366 లో సవరణలు కూడా చేశారు. ఓబీసీ బిల్లు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి అవసరాలకు అనుగుణంగా ఓబీసీల జాబితాను సిద్ధం చేసుకునే వీలును కల్పిస్తుంది.

పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన ఓబీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులకు తగినట్లు ఓబీసీ కులాలను రిజర్వేషన్ కోటాలో చేర్చగలుగుతాయి. ఇది ఏపీలో కాపులు, హర్యానాలో జాట్‌లు, రాజస్థాన్‌లోని గుజ్జర్‌లు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు, కర్ణాటకలోని లింగాయత్‌లకు రిజర్వేషన్లకు మార్గం సుగమం చేస్తుంది. అంతేకాదు, కొత్త కులాలను ఓబీసీలో చేర్చడానికి రాష్ట్రాలకు అధికారం లభిస్తుంది. కాగా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, హర్యానా, బీహార్, గుజరాత్, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో మొత్తం రిజర్వేషన్ 50%కంటే ఎక్కువ ఉండటం, మిగతా రాష్ట్రాలూ అలాంటి ప్రయత్నమే చేసి దెబ్బతింటోన్న నేపథ్యంలో ఓబీసీ బిల్లు రాష్ట్రాలకు రాజకీయంగానూ వరం కానుంది. అయితే, ఇప్పటికీ 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ పరిమితిపై ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడే ఇందిరా సాహ్నీ కేసు ప్రస్తావనకు వస్తుంది.. 1991లో నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక ప్రాతిపదికన జనరల్ కేటగిరీకి 10శాతం రిజర్వేషన్ కల్పించింది. జర్నలిస్ట్ ఇందిరా సాహ్నీ రావు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. సాహ్ని కేసులో, రిజర్వేషన్ కోటా 50%మించరాదని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం తరువాత, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం జరగదని ఒక చట్టం రూపొందించారు.