సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతం నుంచి హరితహారం పథకానికి నిధులు
గ్రామ పంచాయితీ నిధులు మళ్లించడం లేదంటే కేసీఆర్ ఫైర్
ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదన్నకేసీఆర్
భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై కేసీఆర్ ఆశ్చర్యం, చురకలు
ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దన్న సీఎం
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్ష సంపదను రక్షించేందుకు మరో ముందడుగు పడనుంది. పచ్చదనంలో భాగంగా ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతోన్న హరిత హారానికి తోడుగా తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్ ఫండ్) ప్రతిపాదననను శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారు. నిరంతరంగా హరిత ఉద్యమాన్ని కొనసాగించడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ హరిత నిధిపై కీలక ప్రకటన చేశారు. హరిత నిధికి విరాళాలు అందించేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ముందుకు వస్తున్నారని. ప్రతి ఒక్కరూ తమ నెల జీతం నుంచి రూ. 100 ఇస్తామని ఒప్పుకున్నారని ముఖ్యమంత్రి తెలియజేశారు. న్యాక్ ద్వారా (ఆర్ అండ్ బీ) 0.1 శాతం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి నెల రూ. 25ల చొప్పున ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. అలాగే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి నెల రూ. 500 హరిత నిధికి ఇవ్వాలని కోరామని. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంగీకరించారు. మిగతా ప్రజా ప్రతనిధులు సైతం పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయంగా కొంత సొమ్మును ప్రతి నెల అందించాలని సీఎం కేసీఆర్ కోరారు.
అంతేకాకుండా లైసెన్సెస్ రెన్యూవల్ చేసే సమయంలో వ్యాపారులు, బార్లు, మద్య దుకాణాలు ప్రతి ఒక్కరి నుంచి రూ. 1000 చొప్పున.. హరిత నిధి కింద జమ చేయాలని కోరుతామన్నారు. అలాగే, భూముల అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు ప్రతి రిజిస్ట్రేషన్‌కు హరిత నిధి కింద రూ. 50 కలెక్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పాత్ర కూడా ఇందులో ఉండాలని నిర్ణయించామని, విద్యార్థులు తమ పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు పొందే సమయంలో.. స్కూల్ విద్యార్థులు రూ. 5, హైస్కూల్ విద్యార్థులు రూ. 15, ఇంటర్ విద్యార్థులు రూ. 25, డిగ్రీ విద్యార్థులు రూ. 50, అదే విధంగా ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు రూ. 100 ఇస్తే హరిత నిధికి తోడ్పాటు ఉంటుందని సీఎం కేసీఆర్ న్నారు. హరితహారం కార్యక్రమాన్ని యూఎన్‌వో గుర్తించి ప్రశంసించింది. ఈ గ్రీన్ ఫండ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అనుకుంటున్నామని, తెలంగాణ హరిత నిధికి నిరంతరం నిధుల కూర్పు జరిగితే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి దేశీయ, అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహార కార్యక్రమంపై అసెంబ్లీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచే ఉద్భవించిన మరో మానస పుత్రిక హరితహార కార్యక్రమమని అన్నారు. హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, లక్ష్యాన్ని అధిగమించి 239 కోట్ల మొక్కలు నాటమని తెలిపారు. హరితహార కార్యక్రమానికి ఇప్పటివరకు రూ. 6555.97 కోట్లు వెచ్చించామన్నారు. హరితహార కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రమంతా 3.67 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు. ఇదే ప్రణాళికతో ముందుకుసాగుతూ 33% శాతం అటవీకరణ సాధిస్తామని తెలిపారు. అడవులు, పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనపడుతుందని, అటవీ శాఖ మంత్రిగా తాను వ్యక్తిగతంగా ఎంతో గర్వపడుతున్నాను అని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజల్లో పర్యావరణం, ఆరోగ్యం అవగాహన పెరగడంతో మొక్కల నాటాలనే స్పృహ వచ్చిందని చెప్పారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్ కోసం అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే రాష్ట్రంలో పంచాయతీల నిధుల మళ్లింపుపైనా స్పందించారు. గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు అనేది సత్యదూరమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామన్నారు. శాసనసభలో సభ్యుల మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో జాలి పడాల్సి వస్తుంది. ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే సరికాదన్నారు. తెలంగాణలోని సర్పంచ్‌లు దేశంలోనే అత్యంత గౌరవంగా బతుకుతున్నారు. గర్వంగా తల ఎత్తుకునే సర్పంచ్‌లు ఉన్నారంటే మన వాళ్లే. మన సర్పంచ్‌లను కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసించారు. కొన్ని సందర్భాల్లో ప్రధాని, నీతి ఆయోగ్ కూడా ప్రశంసించి అనేక అవార్డులు ఇచ్చింది. ముఖ్రా కే గ్రామానికి అవార్డు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో ఒక వ్యక్తిపై సగటున రూ. 4 ఖర్చు చేస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 650 ఖర్చు చేస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు.
ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదు. మీరు అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే అద్భుతంగా మేం చెప్పగలుగుతాం. మన ఇద్దరి కన్న అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తమ గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించిపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లు బాధ పడ్డ మాట వాస్తవం. ఇవాళ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నారు. గర్వపడుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా లాంటి ఇతర సందర్భాల్లో డబ్బులకు ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే శాసనసభ్యులు, మినిస్టర్ల జీతాలు ఆపమన్నాను. కానీ, పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దని చెప్పాను. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో ప్రతిపక్షాలకు తెలియదా? ఫైనాన్స్ ఆఫ్ కమిషన్ ఇండియా చెప్పిన ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుంది. ప్రత్యేకంగా కేంద్రం నుంచి వచ్చే నిధులేమి ఉండవు. ఇది వారి అవగాహనలోపం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నిధులు రావు. కొన్ని చోట్ల వనరులు ఉంటాయి. కొన్ని చోట్ల వనరులు ఉండవు. ఏజెన్సీ ఏరియాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అన్ని గ్రామపంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం చేయాలో ఆలోచించాం. మేధావులు, మంత్రివర్గం ఆమోదం తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని సభ ముందుకు తెచ్చాం. నిధుల దారి మళ్లింపు అనేది సత్యదూరమని మరోసారి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలపై కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. సర్పంచ్‌ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లను పట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామన్నారు. శాసనసభలో సభ్యులు సత్యదూరమైన విషయాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘకాలిక చర్చ పెట్టండి అని స్పీకర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. తాము అన్నది తప్పకుండా చేసి చూపిస్తాం. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఆ ప్రస్తావనే లేదు. ఆ చట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుదల జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించాం. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీల్లో అవినీతి జరిగింది. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మరణాలు సంభవించేవి. ఇప్పుడు అన్ని సీజనల్ వ్యాధులు, డెంగీ లాంటి విషజ్వరాలు తగ్గిపోయాయి. గ్రామాల రూపురేఖలను మార్చేశామని సీఎం కేసీఆర్ వివరించారు.