sharmila

 

ఉపాధి పేరుతో నయవంచన..

 

🔹54 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు
🔹పెద్ద దొర, చిన్న దొర అంటూ షర్మిల విసుర్లు

 

సిరిసిల్ల (ప్రశ్న న్యూస్) వైఎస్ఆర్ ప్రజలకు ఎంతో మేలు చేశారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. రైతులకు రుణమాఫీ, రుణం తీర్చిన రైతులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో రూ.25వేల ఆర్థిక సాయం చేశారని చెప్పారు. ఉచిత విద్యుత్ ఇచ్చిందే వైఎస్ఆర్ అని.. వైఎస్ హయాంలో పేదింటి బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌తో లక్షలాది మంది చదువుకుని.. జీవితాల్లో స్థిరపడ్డారని.. ప్రపంచంలోనే ఎవరూ ఊహించని విధంగా పేదలకు వైద్యం అందించారని తెలిపారు. ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం అందించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడారని… 108కు ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చేదని… 2004 నుంచి 2009 వరకు పేదలకు 45లక్షల ఇళ్లు కడితే.. ఉమ్మడి రాష్ట్రంలో 4 6లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారని తెలిపారు. ఇవాళ సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో జరిగిన నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల ప్రసంగించారు. 2004, 2006, 2008లో మూడు సార్లు వైఎస్ఆర్ నోటిఫికేషన్లు విడుదల చేసి లక్షల ఉద్యోగాలు కల్పించారని షర్మిల అన్నారు. ప్రభుత్వ రంగం,ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన నేత వైఎస్ఆర్ అని.. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. కేసీఆర్ రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని ఫైరయ్యారు. 25 వేల లోపు లోన్లు ఉన్న లక్షన్నర మందికి మాత్రమే రుణమాఫీ చేసి, చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని.. రుణమాఫీ కాకపోవడంతో కొత్తగా లోన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. బయట ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని ఫైరయ్యారు. 15 లక్షల మంది పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకుంటే.. అవి ఇవ్వకపోగా 2 లక్షల మంది పాత పెన్షనర్లను తొలగించారని ఫైరయ్యారు. 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ మాదిరిగా పూర్తిగా రీయింబర్స్‌మెంట్ ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. 35 వేలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారని తెలిపారు.

54లక్షల మంది యువత ఉద్యోగాలు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పారు. ఇంటికొక ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. దేశంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి అని చెప్పారు. ఏడేండ్లలో నాలుగు రెట్లు నిరుద్యోగం పెరిగిందన్నారు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే.. ఉద్యోగాల కోసం నేడు వందల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ గడీల్లో బందీ అయిందన్నారు. నిరుద్యోగుల ప్రాణాలంటే కేసీఆర్ కు విలువ లేదన్నారు. వందల మంది నిరుద్యోగులు చనిపోతున్నా దున్నపోతు మీద వానపడ్డట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. తన ఇంట్లో అయిదు ఉద్యోగాలు ఉన్నాయి కదా అని మురిసిపోతున్నాడని విరుచుకుపడ్డారు. కళ్ల ముందే కనిపిస్తున్న లక్షా 90వేల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇవి ఆత్మహత్యలా? ప్రభుత్వ హత్యలా? అని అడిగారు. నిరుద్యోగి మహేందర్ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని షర్మిల చెప్పారు. మొన్న షబ్బీర్ అనే అబ్బాయి ఉద్యోగం రావడం లేదని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ల ఇండ్లలో ఎంత ఎంత శోకం మిగిలింది అని అడిగారు. చేతికందిన బిడ్డలు శవమై ఇంటికి తిరిగొస్తే తల్లిదండ్రుల బాధలు మాటల్లో చెప్పలేం అని.. ఇవాళ తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్నారు. పార్టీ ఏర్పాటు చేయకముందే నిరుద్యోగుల కోసం మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశామని. ఇది పెద్ద దొర కేసీఆర్ కు ఇష్టం లేక పోలీసులచే దాడి చేయించి, బట్టలు చింపి, చేయి విరిచి, మహిళలు అని చూడకుండా వ్యవహరించారని ఫైరయ్యారు. నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేశాం అని.. చిన్నదొర ఆడవాళ్లు ఉద్యమాలు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. వారానికి ఒకసారి నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుంటే వ్రతాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేసి , 54 లక్షల మంది నిరుద్యోగులకు ఒక మార్గం చూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అని పిలిస్తే వాళ్లకి నచ్చడం లేదు. మరి ఏమని పిలవాలో వాళ్లే చెప్పాలని షర్మిల అడిగారు. అమెరికా నుంచి తీసుకొచ్చి, మొదటిసారి గెలిస్తే రెండు శాఖలకు మంత్రిని చేశారని.. ఆయనకు ఏ అర్హత ఉందని మంత్రి పదవులిచ్చారు? కొడుకు అనే కదా ఇచ్చింది? ఉన్నమాటంటే ఉలుకెందుకు? అని షర్మిల విరుచుకుపడ్డారు.

మహేందర్ యాదవ్ చనిపోతే, ఆత్మహత్యలు చేసుకోకండి ఉద్యోగాలు కల్పిస్తాం అని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా? అని షర్మిల అడిగారు. నిరంకుశ, దొరల పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని సూచించారు. చిన్నదొర రిబ్బన్ కటింగ్‌కు జిల్లాకు వస్తున్నాడంటే రెండు రోజుల ముందే ప్రజా సంఘాల నాయకులను, జర్నలిస్టులను నిర్బంధిస్తారని చెప్పారు. అదేమిటని ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. పాలకులను దళితులపై ఉన్న ప్రేమ ఇదేనా? నేరేళ్ల ఘటనలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పైరయ్యారు. ప్రభుత్వం లక్షా 91వేల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు కావాల్సిన సిబ్బందిని కూడగట్టుకుంటే దాదాపు 3 లక్షల 85 ఖాళీలు ఉంటాయని ఒక అంచనా ఉందన్నారు. వీటిపైనా లెక్క తేల్చి, ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 54 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇప్పించి ఓ మార్గం చూపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లలో దరఖాస్తు పెట్టుకున్న 10 లక్షల మందికి లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే నిరుద్యోగులకు ప్రతి నెలా 3,016 రూపాయలు ఇస్తానని కేసీఆర్ చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.