ఎక్కడ తిరస్కరించారో…అక్కడే ఆధిపత్యం
🔹పూర్తి మెజార్టీతో వైసీపీ
🔹సీఎం జగన్ కొత్త సమీకరణాలు..
అమరావతి (ప్రశ్న న్యూస్) ముఖ్యమంత్రి జగన్ నాడు ప్రతిపక్ష నేతగా నంద్యాల ఉప ఎన్నికల ఫలితం వెలువడిన తరువాత కొన్ని వ్యాఖ్యలు చేసారు. దెబ్బ కొట్టారు.. కొట్టించుకున్నాం. మాకు సమయం వస్తుంది. మా దెబ్బ ఏంటో చూపిస్తాం…2019 ఎన్నికల ఫలితాల్లో అదే విధంగా ప్రత్యర్ధి పార్టీలకు సమాధానం దొరికింది. ఫలితంగా శాసనసభలో 151 సీట్లతో తిరుగులేని మెజార్టీ సాధించారు. ఇక, ఇప్పుడు శాసనమండలి లోనూ అదే తరహా ఆధిపత్యం అందుకుంటోంది. ఈ నెల 18వ తేదీ నుండి ఏపీ శాసనమండలిలో వైసీపీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోంది. 2019 డిసెంబర్ లో ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేసారు. ఆ తరువాత జనవరి 2020 లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై రాజధాని బిల్లులను ఆమోదించింది. వెంటనే శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదం ప్రకటించారు. ఆ వెంటనే శాసన మండలికి బిల్లుల ఆమోదానికి వెళ్లాయి. అక్కడ టీడీపీ ఆ సమయంలో ఆధిపత్యం కొనసాగుతోంది. టీడీపీకి మెజార్టీ ఉండ టంతో..మూడు రోజుల హైడ్రామా కొనసాగింది. చివరకు టీడీపీ అధినేత మండలి గ్యాలరీకి వచ్చి కూర్చుకున్నారు. చివరకు ఛైర్మన్ తన విఛక్షణాధికారం మేరకు బిల్లులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో..తాము అధికారంలో ఉన్నా.. తమ మాటకు గౌరవం లేకుండా … తమను అవమానించే విధంగా వ్యవహరించారనే కారణంతో.. వెంటనే శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. అయినా..అది ఇంకా ఆమోదం పొంద లేదు.
ఇదే సమయంలో వరుసగా శాసన మండలిలో సభ్యులు ఒకరి తరువాత మరొకరు పదవీ విరమణ చేస్తున్నారు. ఆ సీట్లన్నీ శాసనసభలో మెజార్టీ ఉండటంతో వైసీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఫలితంగా ఈ రోజుతో శాసనమండలిలో వైసీపీ పూర్తి ఆధిపత్యం సంపాదిస్తోంది. మొత్తం శాసన మండలిలో సభ్యుల సంఖ్య 58. అందులో రేపు (జూన్ 18, 2021) న ఏడుగురు టీడీపీ..ఒక వైసీపీ సభ్యుడు శాసన మండలి కోటాలో ఎన్నికైన వారు పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఇదే కోటాలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. కాగా, కరోనా కారణంగా ఎన్నికలు జరగకుండా నిలిచిన ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో..మొత్తం 14 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఫలితంగా 44 మంది సభ్యులు ప్రస్తుతం సభలో ఉన్నారు. అందులో వైసీపీ నుండి 19, టీడీపీ నుండి 15 మంది, బీజేపీతో సహా ఉపాధ్యాయ..గ్రాడ్యుయేట్ స్థానాలు కలుపుకొని పది మంది ఉన్నారు.
తాజాగా పదవీ విరమణ చేస్తున్న వారిలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి..టీడీపీ నుండి జగదీశ్వరరావు, గాలి సరస్వతి, బుద్దా వెంకన్న, రెడ్డి సుబ్రమణ్యం, బాబు రాజేంద్ర ప్రసాద్, పప్పల చలపత రావు, నాగ జగదీశ్వర రావు ఉన్నారు. దీంతో..ఇందులో రెడ్డి సుబ్రమణ్యం ప్రస్తుతం శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్నారు. ఇక, మండలికి కొత్త ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన్ ను ఎన్నుకోవాల్సి ఉంది.ఇప్పుడు ఒకే రోజున పదవీ విరమణ చేస్తున్న ఎనిమిది మంది సభ్యుల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలంటే…ఏపీలో హైకోర్టు తీర్పు మేరకు రద్దయిన స్థానిక సంస్థల అంశం తేలాల్సి ఉంది. ఆ తీర్పు పైన అప్పీల్ కు వెళ్లటమా..లేక తిరిగి ఎన్నికలు నిర్వహించటమా అనే నిర్ణయం ఆధారంగా ఆ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాతనే శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎన్నికల సంఘం ఆమోదం తెలిపి నోటిఫికేషన్ విడుదల చేస్తే..ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. ఇలా..అటు శాసన సభలో…ఇటు శాసన మండలిలో వైసీపీ పూర్తి ఆధిపత్యంతో ముందుకు సాగనుంది.