Main3

కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌

 

🔹ఏపీలో గృహ నిర్మాణాల మహోత్సవం
🔹రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదు
🔹పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నాం
🔹వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

 

అమరావతి (ప్రశ్న న్యూస్) దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ‘‘175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. తొలి విడతలో రూ.28,084 కోట్లతో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నాం. వచ్చే ఏడాది జూన్‌ 22 కల్లా  తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తాం. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. పిమే తో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. 17 వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని’’ సీఎం జగన్ పేర్కొన్నారు.

17 వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తి ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. విశాలమైన రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ‘‘17005 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు కేటాయించాం. 340 చ.అడుగుల ఇంటిలో ఒక బెడ్‌ రూమ్‌, హాల్, కిచెన్‌, బాత్‌రూమ్‌, వరండా ఏర్పాటు చేస్తాం. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. ఇళ్లు మంజూరు చేసిన మహిళలకు మూడు అప్షన్లు ఇచ్చాం. మొదటి ఆప్షన్‌: అవసరమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సమకూరుస్తుంది. రెండో ఆప్షన్‌: అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్దిదారులే తెచ్చుకునేలా స్వేచ్ఛ. మూడోఆప్షన్: ప్రభుత్వం నిర్దేశించిన నిర్మాణ సామగ్రితో పాటు ఇంటి నిర్మాణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని’’ సీఎం అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటితో పాటు ఇంటి స్థలం అందజేస్తున్నాం. 30 రకాల పనులు చేసే వారికి సొంత గ్రామాల్లోనే ఉపాధి లభిస్తుంది. దాదాపు 21.70 కోట్ల పనిదినాలు కల్పించబోతున్నాం. ప్రతి ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక భారం తగ్గించేందుకు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే ఇంటి సామగ్రి ఇస్తున్నాం. సిమెంట్‌ను రూ.225 లకే తగ్గించి ఇస్తున్నాం. స్టీలు రేట్లు తగ్గించి ఇస్తున్నాం. నాణ్యతతో కూడిన సామగ్రిని రివర్స్ టెండరింగ్‌ ద్వారా అందిస్తున్నాం. మండల, గ్రామ స్థాయిలో గోదాములు ఏర్పాటు చేసి వీటిని అందుబాటులో తెస్తున్నాం.

ఇళ్ల నిర్మాణం పూర్తయితే సదుపాయాల రూపంలో ప్రతి ఇంటికి రూ.లక్షన్నర ఖర్చు చేస్తున్నాం. ఇంటి నిర్మాణం కోసం రూ.1.8 లక్షలు ఇస్తున్నాం. దాదాపు రూ.7 లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల్లాలోని పేదవారికి కాలనీలు పూర్తయ్యేసరికి.. రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు  ఆస్తి సమకూరుతుంది. మొత్తంగా రాష్ట్రంలో ఎకనామిక్ బూస్ట్ వస్తుంది. అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోనే అన్ని అర్హతలు పరిశీలించి మంజూరు చేస్తాం. అన్ని జిల్లాల్లో హౌసింగ్‌కు జాయింట్‌ కలెక్టర్ ఉండేలా ఉత్తర్వులు జారీ చేశాం. కేవలం గృహ నిర్మాణాల పర్యవేక్షణను హౌసింగ్ జేసీ చూస్తారని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.