Sharmila

 

టీడీపీ నేతకు పీసీసీ పట్టం.. షర్మిల ఫస్ట్ కౌంటర్

 

🔹అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితం

🔹రాజన్న రాజ్యంలో ఆరోగ్య శ్రీ..ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలు..

🔹అయిదో స్తంభం..సోషల్ మీడియా అన్న షర్మిల

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఇంకొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లోకి అధికారికంగా అడుగు పెట్టడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె..ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. చివరి విడత ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సారి ఆమె సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పలువురు వైఎస్సార్ అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే.. విద్య, వైద్యం.. రెండింటినీ ఉచితం చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో కోట్లాదిమంది ఈ రెండు రంగాల మీద ఆధారపడి ఉన్నారని అన్నారు. విద్య, వైద్య రంగాలు కార్పొరేట్‌మయం కావడం అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తాయనే ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. ఈ సమాజంలో నివసించే ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యాన్ని ఉచితంగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయని చెప్పారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో నలుగుతోన్న ఈ రెండింటికీ స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇందులో భాగంగానే-దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలను అమలు చేశారని షర్మిల గుర్తు చేశారు. ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలనే సదాశయంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అదే తరహాలో- ప్రతిభ ఉండి కూడా ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు అత్యున్నత విద్యను అభ్యసించాలని వైఎస్సార్ కలలు గన్నారని అన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ రూపంలో దాన్ని నిజం చేసి చూపారని చెప్పారు. కోట్లాదిమంది పేద విద్యార్థులు ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం కింద ఉన్నత విద్యను అభ్యసించి.. జీవితంలో స్థిరపడ్డారని అన్నారు. ఈ రెండు పథకాల లబ్ది పొందని కుటుంబం దాదాపు లేదని వైఎస్ షర్మిల చెప్పారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాలను నీరుగార్చాయని విమర్శించారు. అందుకే- తమ పార్టీ అధికారంలోకి వస్తే.. విద్య, వైద్యాన్ని ఉచితం చేస్తామని షర్మిల ప్రకటించారు. వైఎస్సార్ ఆశయాలను సాధిస్తామని అన్నారు. రాజన్న రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం అన్నీ ఉచితంగా అందిస్తామని వైఎస్ షర్మిల గారు ప్రకటించారు. హైదరాబాద్ లోటస్పాండ్ లో పార్టీ వెబ్ సైట్ ప్రారంభించారు. ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం సోషల్ మీడియా అన్న షర్మిల.

జులైన 8వ తేదీన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారిక ప్రకటన ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారిందని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యానికి ప్రధాన మీడియా నాలుగో స్తంభంగా మారితే.. సోషల్ మీడియా అయిదో స్తంభంగా ఆవిర్భవించిందని షర్మిల వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా తన విచక్షణను కోల్పోకూడదని అన్నారు. తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశంలో కొనసాగిన అనంతరం కాంగ్రెస్‌ తీర్థాన్ని పుచ్చుకొన్న రేవంత్ రెడ్డికి కొత్తగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా నియమించడాన్ని వైఎస్ షర్మిల తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సైతం సోషల్ మీడియా ఉద్యోగులను నియమించుకుందని, తమ పార్టీకి ఆ అవసరం లేదని అన్నారు. వైఎస్సార్‌పై గుండెల్లో దాచుకున్న అభిమానంతో తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు పని చేస్తారని చెప్పారు. వారికి ఎలాంటి అవసరం వచ్చినా.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.